militant
-
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
పాక్ ప్రతీకార చర్య.. ఇరాన్‌పై వైమానిక దాడులు
ఇస్లామాబాద్: ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. పాకిస్థాన్ కూడా ఇరాన్ వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఇరాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో నలుగురు పిల్లలతోపాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది. Sources in the Pakistani Armed Forces are reporting that the Air Force has conducted several Airstrike tonight on a Baloch Militant Group in Eastern Iran near the City of Saravan, roughly 20 Miles into the Sistan and Baluchestan Provence from the Border with Pakistan; Smoke is… pic.twitter.com/VKO8fjohWD — OSINTdefender (@sentdefender) January 18, 2024 ఇరాన్ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ రాయబారిపై వేటు వేసింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా స్పందించింది. ఇదీ చదవండి: పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు -
భద్రతా కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి!
జమ్మూకశ్మీర్‌లోని బుడ్గామ్ జిల్లాలో మంగళవారం భద్రతాదళాలు చేపట్టిన మిలిటెంట్ వ్యతిరేక ఆపరేషన్‌లో ముగ్గురు పౌరులు, ఒక మిలిటెంట్ మృతిచెందారు. ఒక జవానుకు గాయాలయ్యాయి. పలువురు పౌరులు కూడా గాయపడ్డారు. మిలిటెంట్‌ను తప్పించడానికి స్థానికులు ప్రయత్నించారని, పెద్ద సంఖ్యలో గుమిగూడిన స్థానికులు ఆందోళనకు దిగి .. భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో.. భద్రతా దళాలు కాల్పులు జరిపాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్ ప్రాణాలు విడిచాడని, అతని వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. భద్రతా దళాల ఆపరేషన్‌లో జహిద్ దార్, సకిబ్ అహ్మద్, ఇష్ఫాక్ అహ్మద్ వనీ అనే యువకులు మృతిచెందారు. మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు బుడ్గామ్ జిల్లాలోని దుర్భాఘ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ఓ కానిస్టేబుల్ మృతి శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలకూ.. ఉగ్రవాదులకూ మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుమారు 12 గంటల పాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కాల్పులు ఆదివారం ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగాయి. ఈ కాల్పుల్లో యూరీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్ చనిపోయాడు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఆకీబ్ భట్ అలియాస్ ఆకీబ్ మౌల్వీగా గుర్తించారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇతను యాక్టివ్‌గా పనిచేస్తున్నట్టు భద్రతా బలగాలు చెపుతున్నాయి. మరో ఉగ్రవాదిని సైఫుల్లా అలియాస్ ఒసామాగా గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన సైఫుల్లా జేషే మహమూద్ ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేస్తున్నట్టు తెలిపాయి. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్
-
కల్నల్ భర్త మరణం.. ఆర్మీలోకి భార్య!
గత నవంబర్ లో జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆర్మీ కమాండో సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరనున్నారు. సంతోష్ మహాదిక్ అంత్యక్రియల సమయంలో ఆమె ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ ఆమెకు వయసు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) పరీక్షలో ఆమెకు వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు. గత వారం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో కష్టతరమైన ఐదు రౌండ్లను ఆమె ఎదుర్కొన్నారు. సోమవారం మెడికల్ పరీక్షకు హాజరై.. విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో 38 ఏళ్ల స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై స్పందించడానికి ఆమె తిరస్కరించారు. గత ఏడాది నవంబర్ 27న కుప్వారాలోని ఎల్ఓసీ వద్ద జరిగిన మిలిటెంట్ల దాడిలో యూనిట్ 41-రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సంతోష్ మహాదిక్ వీరమరణం పొందారు. గణతంత్ర దినోత్సవం నాడు భారతప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. -
కాశ్మీర్లో కాల్పులు : తీవ్రవాది మృతి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని కల్హార్ ప్రాంతంలో తీవ్రవాదులు... భద్రత దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాది మృతి చెందాడని పోలీసులు చెప్పారు. అతడి మృతదేహం వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌తోపాటు మూడు ఏకే మేగజీనులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భద్రత దళాలకు చెందిన వారికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
ఐఎస్ వద్దందని అమ్మనే చంపేశాడు
ఎవరికోసమో, ఎందుకోసమో అర్థంకాని పోరాటం వద్దంది. మిగిలిన పేగు బంధం నువ్వొక్కడివే.. ఎక్కడికైనాపోయి బతుకుదాం రమ్మంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తాగింది తల్లిపాలే అయినా మతం మత్తులో నిలువెల్లా కలుషితమైన ఆ కొడుకు.. మాతృమూర్తినే అంతం చేశాడు. ఐఎస్ ది తప్పుడు మార్గం అన్నందుకు సొంత తల్లిని బహిరంగంగా కాల్చేశాడు. సిరియాలోని రక్కా పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న సంచలనాత్మక ఉదంతాన్ని రిబ్స్ సంస్థ వెలుగులోకి తెచ్చింది. లీనా అల్ ఖాసిం (45) రక్కాలోని పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిని. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఆమె.. పిల్లల్ని కూడా ఉన్నతంగా చదివించాలనుకుంది. కానీ విధి మరోలా ఎదురైంది. సిరియాలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం చివరికి ప్రపంచ దేశాల యుద్ధంగా మారి.. ఒక్క కొడుకు తప్ప దాడుల్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె కొడుకు అలీ సఖ్ర్ అల్ ఖాసీంకు 20 ఏళ్లు. కొద్ది రోజుల కిందటే అలీ ఐఎస్ఐఎస్ జీహాదీగా మారడం తల్లిని కలవరపర్చింది. ఐఎస్ ను వీడాలంటూ లీనా కొడుకుపై ఒత్తిడి తెచ్చింది. బయటిదేశాలకుపోయి ప్రశాంతంగా బతుకుదామని చెప్పింది. తల్లి తనతో పంచుకున్న విషయాల్ని సీనియర్లకు చేరవేశాడు అలీ. అంతే. లీనా ఇస్లామ్ కు ద్రోహం తలపెట్టిందని, వెంటనే ఆమెకు మరణ దండన అమలుచేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. పట్టపగలు, అందరూ చూస్తుండగా, ఆమె పనిచేసే పోస్టాఫీసు ఎదుటే లీనాను కాల్చిచంపారు ఐఎస్ ఉగ్రవాదులు. ఆమె తలకు గురిపెట్టి తుపాకి పేల్చింది మరెవరోకాదు ఆమె కొడుకు అలీయే. -
బురఖాలో వచ్చి కాల్పులు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో బురఖాలో వచ్చిన ఓ వ్యక్తి శుక్రవారం సైనిక ప్రత్యేక దళాలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు గాయపడ్డారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యులు అడ్డుకున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో బురఖాలో ఉన్న వ్యక్తి విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడింది వేర్పాటు వాద గెరిల్లా దళ సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన శ్రీనగర్ కు కూతవేటు దూరంలోని బస్టాండ్ లో చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి చెందారు. పూర్తి వివరాలు: కశ్మీర్‌లోని రెడ్వాని ప్రాంతంలో హోంషాలిబాఘ్ ఎమ్మెల్యే జహూర్ అహ్మద్ దార్ ఇంటికి సమీపంలో శనివారం ఉదయం మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే దార్ తీవ్రంగా గాయపడగా.. జహూర్ అహ్మద్ ఇలాహి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత పనిమీద ఇలాహితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. -
అఫ్ఘాన్‌లో కాల్పులు.. అమెరికా మేజర్ జనరల్ మృతి
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లపై 13 ఏళ్లుగా పోరాడుతున్న అమెరికా సేనలకు తొలిసారిగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాబూల్‌కు పశ్చిమాన గల ఖార్గా క్యాంపు వద్దకు మంగళవారం అఫ్ఘాన్ ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన ఓ ఉగ్రవాది నాటో బలగాలపై కాల్పులు జరపడంతో అమెరికాకు చెందిన ఓ మేజర్ జనరల్ మృతి చెందారు. జర్మనీకి చెందిన ఓ బ్రిగేడియర్ జనరల్‌తో సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో సగం మంది అమెరికా సైనికులు, ముగ్గు రు అఫ్ఘాన్ ఆర్మీ అధికారులు ఉన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లపై నాటో బలగాలు సాగిం చిన యుద్ధంలో ఇంత అత్యున్నత స్థాయి అధికారిని అమెరికా కోల్పోవడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయని అఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారి ప్రకటించారు. దీనిని పెం టగన్లోని అమెరికా రక్షణ శాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. -
నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి
అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని ఒక కాలేజీపై ఆదివారం మిలిటెంట్లు జరిపిన దాడిలో 50 మంది మృతి చెందారు. యోబె రాష్ట్రంలోని గుజ్బాలో వ్యవసాయ కళాశాల హాస్టల్‌పై సాయుధ మిలి టెంట్లు కాల్పులకు తెగబడ్డారు. విద్యార్థులందరూ గాఢనిద్రలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. యోబె రాజధాని దమాతురులోని ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అకస్మాత్తుగా దాడి జరగడంతో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత మిలిటెంట్లు కళాశాలకు నిప్పుపెట్టారని సైనిక ప్రతినిధి లాజరస్ ఎలీ చెప్పారు. ఈ దాడి ‘బోకో హరామ్’ ఇస్లామిక్ మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు -
కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత అరెస్ట్
నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన అగ్రనేతల్లో ఒకరైన తలిబ్ లలితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులను బండిపూర జిల్లాలో భద్రతాదళాలు ఈ రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. అజాస్ ప్రాంతంలో తీవ్రవాదులు ఆశ్రయం పొందినట్లు తమకు సమాచారం అందింది. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి తీవ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో పోలీసులకు, తీవ్రవాదులు తారసపడ్డారు. ఆ క్రమంలో ఇరువైపుల భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు ఆదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. అయితే తీవ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎవరు గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురు తీవ్రవాదులను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యాప్తికి తలిబ్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు.