శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.
ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు.
ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా.
ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్‌సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె
Comments
Please login to add a commentAdd a comment