సుప్రీం చెప్పినా..నీళ్లు వదలం
బెంగళూరు: సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కావేరి జలాలను తమిళనాడుకు వదలడంపై కర్ణాటక తాత్సారం చేస్తోంది. నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 23న గవర్నరు అనుమతితో ఉభయ సభలను సమావేశ పరచాలని బుధవారం జరిగిన అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 23వరకు నీటిని వదలబోమని సీఎం సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. ఈ నిర్ణయాన్ని మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.
కావేరీ జలాలను బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం మంగళవారం ఆదేశించడం తెలిసిందే. దీంతో.. కర్ణాటక సర్కారు బుధవారమంతా చర్చలు జరిపి పై నిర్ణయానికి వచ్చింది. రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించి బాగా పొద్దుపోయాక సిద్ధరామయ్య వివరాలను మీడియాకు చెప్పారు. అఖిలపక్ష భేటీకి బీజేపీ గైర్హాజరైంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలుజగదీష్‌శెట్టర్, సదానందగౌడ తదితరులు ప్రధాని నరేంద్ర మోదీని కలసి కావేరి విషయంలో కలుగజేసుకోవాలని కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం.