
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సహచరుడు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా దాఖలు చేసిన పరువు నష్టం కేసు నుంచి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది.
షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో 2012 అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఖేరా పరువునష్టం దావా వేశారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తాను ఆమె రాజకీయ సహాయకుడిగా ఉన్నందున తన గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని ఖేరా ఈ కేసులో పేర్కొన్నారు.
అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలు నేరుగా ఖేరాను ఉద్దేశించి లేనందున ఆయన ప్రతిష్టకు నిర్ధిష్టంగా ఎలాంటి భంగం వాటిల్లలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఫిర్యాదుదారుపై నిందితుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ప్రాధమిక ఆధారాలు లేవని, ఫిర్యాదుదారు దాఖలు చేసిన పరువునష్టం దావాను కొనసాగించలేమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment