న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండడం, వారికి ప్రత్యేక సదుపాయం కల్పించడం కష్టం అవుతుండడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లోని బెడ్లను ఢిల్లీ జాతీయ రాజధాని పరిధిలో నివసిస్తున్న వారికి మాత్రమే రిజర్వ్ చేస్తున్నట్లు, ఆంకాలోజీ, న్యూరోసర్జరీ కేసులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా ఆస్పత్రిలో చేరడానికి జాతీయ రాజధాని పరిధిలో నివసిస్తున్నట్లు తగిన ధ్రువ పత్రాలను కూడా చూపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీవించే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఈ హక్కు రాజ్యాంగం 21వ అధికరణ కింద గ్యారంటీ ఇచ్చింది. అందుకని ఒకరి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి, మరొకరి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం కుదరదని, ఇందులో ఉన్నత స్థాయివారు, కాని వారంటూ వివక్షత చూపడం కూడా తగదని 1998లో ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తూ ఢిల్లీయేతరులకు ఉచిత వైద్యాన్ని నిరాకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఈ రెండు తీర్పుల ప్రకారం ఢిల్లీ ఆస్పత్రి బెడ్లను ఢిల్లీ జాతీయ రాజధాని పరిధిలోని వారికే కేటాయించడం చెల్లదు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించారేమో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చ్రెర్మన్ కూడా అయిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆస్పత్రులకు వచ్చే ప్రజలందరికి చికిత్స అందించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేశారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!)
Comments
Please login to add a commentAdd a comment