సాధారణంగా ముఖ్యమంత్రులంటే.. మంత్రులందరిలోకీ ముఖ్యమైన వారు. అందుకే చాలా ముఖ్యమైన శాఖలు తీసుకుంటారు. కానీ, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విభిన్నంగా వ్యవహరించారు. తనకు శాఖలేవీ వద్దని చెప్పారు. ఆయన మొత్తం మంత్రులందరి పనితీరును పర్యవేక్షిస్తుంటారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. ఆర్థికశాఖ, విద్యుత్ శాఖ సహా కీలక శాఖలన్నీ మనీష్ వద్దే ఉన్నాయి. ప్రధానంగా అవినీతి నిర్మూలన, ధరల నియంత్రణ, నిరంతరాయంగా విద్యుత్, నీటి సరఫరా మీద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దృష్టి పెడుతుందని సిసోదియా చెప్పారు. ప్రజలకు వీలైనంత ఉత్తమ సేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన అన్నారు. రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సుదీర్ఘ కాలంగా కేజ్రీవాల్ వెన్నంటే ఉన్న, అత్యంత నమ్మకస్థుడైన సిసోదియా .. ఆర్థిక, ప్రణాళిక, సేవ, విద్య, ఐటీ, సాంకేతిక విద్య, పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, భూమి.. భవనాల విజిలెన్స్, ఇతర మంత్రులకు కేటాయించని అన్ని శాఖలను చూస్తారు. గతంలో కూడా కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న సత్యేంద్ర జైన్ ఈసారి ఆరోగ్య శాఖతో పాటు పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ, ప్రజాపనుల శాఖలు చూసుకుంటారు. కొత్తమంత్రుల్లో ఒకరైన గోపాల్ రాయ్ ఉపాధి కల్పన, అభివృద్ధి, కార్మిక, రవాణా శాఖలు చూస్తారు. జితేందర్ సింగ్ తోమర్కు న్యాయ, పర్యాటక, కళ, సాంస్కృతిక, హోం మంత్రిత్వశాఖలు అప్పగించారు. ఆసిమ్ అహ్మద్ ఖాన్ ఆహార, పర్యావరణ, అటవీ శాఖలు చూస్తారు. సందీప్ కుమార్కు మహిళా శిశు సంక్షేమ శాఖ, భాష, ఎస్సీ, ఎస్సటీ సంక్షేమ శాఖలు అప్పగించారు.
మంత్రిత్వ శాఖ తీసుకోని ముఖ్యమంత్రి
Published Sat, Feb 14 2015 8:04 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement