
28న కేజ్రీవాల్ ప్రమాణం
అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరుకు వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ(నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) ఏడవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేత అరవింద్ కేజ్రీవాల్(45) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా ‘ఆమ్ ఆద్మీ’ నేత
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరుకు వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ(నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) ఏడవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేత అరవింద్ కేజ్రీవాల్(45) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రులుగా మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భార్తి, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోని, సత్యేంద్ర జైన్‌లు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వారం లోపల(జనవరి 3 లోగా) కేజ్రీవాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జనవరి 1న నూతన అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్నాహజారే, కిరణ్ బేడీ, సంతోష్‌హెగ్డే సహా అవినీతి వ్యతిరేక పోరాటంలో సహచరులుగా నిలిచిన వారందరినీ ఆహ్వానిస్తున్నట్లు కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని, ఆ పార్టీతో ఎలాంటి ఒప్పందాలు కూడా ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో, ఆ తరువాత తాము పేర్కొన్న 18 అంశాల అమలుకు కృషిచేస్తామని, అందుకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తామిచ్చిన హామీలను అమలు చేయడంలో వచ్చే అన్ని అడ్డంకులను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జన్ లోక్‌పాల్ బిల్లును 15 రోజుల్లోగా తీసుకువస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే, ఆ బిల్లుకు తక్ష ణం చట్టబద్దత కల్పించడంలో సమస్యలున్నాయన్నారు. నిబంధనల ప్రకారం జన్‌లోక్ చట్టం చేయడానికి కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏదైనా చట్టం చేసేముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఆయన తప్పుపట్టారు. అది బ్రిటిష్ కాలంనాటిదని విమర్శించారు. మంత్రిపదవుల విషయంలో పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని, లక్ష్మినగర్ ఎమ్మెల్యే బిన్నీకి మంత్రిపదవిపై ఆసక్తి లేదని, ఆ విషయం ఆయనే తనకు స్వయంగా చెప్పారని కేజ్రీవాల్ వివరించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు తరువాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగవద్దని ఆప్‌కు కాంగ్రెస్ సూచించింది. అలా చేస్తే మేం కూడా ప్రతిచర్యకు దిగాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాఖ నూతన అధ్యక్షుడు అర్విందర్ సింగ్ హెచ్చరించారు.