దిలీప్, కావ్య మాధవన్
కొచ్చి: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను విచారించిన పోలీసులు తాజాగా ఆయన భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు అర్థరాత్రి 2 గంటలకు కొనసాగినట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పేమెంట్స్ గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే సోదాలపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ నేరం చేసిన తర్వాత రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు నటిపై అఘాయిత్యానికి పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోలు ఉన్న మెమరీ కార్డును కూడా కార్యాలయంలోనే దాచిపెట్టివుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఇక్కడ సోదాలు జరిపారు. 2016లో దిలీప్, కావ్య పెళ్లి చేసుకున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన తర్వాత తన మొదటి భార్య మంజు వారియర్‌కు 2015లో దిలీప్ విడాకులు ఇచ్చారు. వ్యాపారవేత్త నిశాల్ చంద్రను 2009లో పెళ్లి చేసుకున్న కావ్య 2010లో ఆయన నుంచి విడిపోయారు.