తిరువంతపురం: ఒకప్పుడు పెళ్లంటే అటేడుతరాలు, ఇటేడుతరాలు గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా వారం రోజులపాటు చేసేవారు. ఆ తర్వాత అది ఒక్కరోజుకు తగ్గినా ఖర్చు మాత్రం పెరుగుతూ వచ్చింది. బంధు బలగం సరేసరి. అయితే కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు పెళ్లంటే వధూవరులు కూడా పక్కన ఉండాల్సిన పని లేకుండా పోయింది. ఎవరెక్కడ ఉన్నా వారి చేతిలో ఫోన్ ఉంటే పెళ్లి చిటికెలో పని అయిపోయింది. తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఫోన్‌లోనే పెళ్లి కానిచ్చేసింది. ఇందుకోసం కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్.. అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు. (కలెక్టరేట్‌లో పెళ్లి.. వరుడి 2నెలల జీతం..)
అక్కడ వధువు తండ్రి ఉండగా, పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్‌లో లైవ్‌లోకి వచ్చారు. వెంటనే తాళిబొట్టు చేతపట్టుకుని వరుడు ఫోన్‌కు వెనకవైపున కట్టాడు. అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. ఈ తతంగం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రిసెప్షన్‌తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ జరుపుతామని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment