
తిరువనంతపురం : భారీ వర్షాలకు కేరళ చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. వరద బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు శక్తికి మించి కృషి చేస్తున్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ బలగాలకు పలువురు మత్య్సకారులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. వెంగర ప్రాంతంలో దాదాపు 600 మంది స్థానిక మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయక శిబిరాలు చేర్చేందుకు తమ వంతు కృషిచేస్తున్నారు.
అలా సహాయక చర్యల్లో పాలు పంచుకున్న కేపీ జైస్వాల్ అనే మత్య్సకారుడు రియల్ హీరోగా నిలిచాడు. వరదల్లో చిక్కుకున్న మహిళలను, చిన్నారులను బోట్‌లోకి ఎక్కించడానికి అతను నీటిలో వంగి తన వెన్నును మెట్టుగా మార్చాడు. అలా మహిళలు, చిన్నారులు బోటు ఎక్కడానికి సహాయపడ్డాడు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఆ ప్రాంతంలోకి చేరుకోవడం కష్టంగా మారడంతో.. వారి వద్ద నుంచి బోట్లను తీసుకుని వరదల్లో చిక్కుకున్న వారిని తామే సహాయక శిబిరాలకు చేరవేస్తున్నట్టు జైస్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. జైస్వాల్ చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు. అతన్ని రియల్ హీరో అంటు నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, కేరళ ప్రజలను ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు, దేశ నలుమూలల నుంచి పలువురు తమకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నారు. ఇతర దేశాలు కూడా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment