
సాక్షి, న్యూఢిల్లీ: పసి పిల్లలకు చనుబాలు ఇచ్చేందుకు తల్లులు మొహమాటం వీడాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ‘గృహలక్ష్మి’ మేగజీన్ చేసిన ప్రయత్నం మంచిదేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి బిడ్డ ఆకలి తీర్చుతున్న కవర్ ఫోటోపై అభ్యంతరాలు లేవని తెలిపింది. భారతీయ సంప్రదాయంలో మానవ దేహానికి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ప్రాచీన కళలు, బొమ్మల్లో మానవ దేహ సౌందర్యాన్ని వర్ణించారని తెలిపింది. అయితే, చూసే కళ్లను బట్టి దాని అంతరార్థం బోధ పడుతుందని పేర్కొంది. అజంతా చిత్రాలు, రవివర్మ పేయింటింగ్స్‌లో అశ్లీలతను చూసేవారు కొందరైతే, అద్భుత కళా సౌందర్యాన్ని చూసేవారు మరి కొందరని వివరించింది.
విషయం.. దేశ వ్యాప్తంగా ప్రతియేడు తల్లిపాలు సరిపడా అందక దాదాపు లక్ష మంది శిశువులు డయేరియా, న్యూమోనియా బారినపడి చనిపోతున్నారు. విదేశాల్లో మాదిరిగా మన దేశంలో పిల్లలకు పాలు ఇవ్వడానికి సదుపాయాలు లేవు. జన సమూహ ప్రదేశాల్లో, బహిరంగంగా చిన్నారుల ఆకలి తీర్చడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లులకు అవగాహన కల్పించాలనే సదాశయంతో గృహలక్ష్మి మేగజీన్ తన మార్చి సంచిక కవర్ ఫోటోపై మోడల్ గిలు జోసెఫ్ బిడ్డకు చనుబాలు ఇస్తున్న చిత్రాన్ని ప్రచురించింది.
అయితే, స్త్రీ జాతిని అవమానిస్తున్నారని కొందరు, మోడల్ చేతిలో ఉన్న శిశువు హక్కులను కాలరాస్తున్నారని మరికొందరు సోషల్ మీడియాలో విమర్శించారు. కేరళకు చెందిన వినోద్ మాథ్యూ విల్సన్ మేగజీన్ నిర్వాహకులు, జోసెఫ్‌పై కేసు పెట్టారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు కవర్ ఫోటోలో అశ్లీలత ఏమీ లేదని పేర్కొంటూ పై విధంగా తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment