![Kerala Minister Says Govt Will Not Support Publicity Mongers Over Sabarimala Row - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/15/sabarimala_0.jpg.webp?itok=JgIXLLTK)
తిరువనంతపురం : శబరిమల కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన క్రమంలో.. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకోనున్న తరుణంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించే మహిళలు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తారని వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘యాక్టివిజం ప్రదర్శించడానికి కార్యకర్తలు శబరిమలను ఎంచుకుంటామంటే కుదరదు. కొంతమంది పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కేవలం ప్రచార యావతోనే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఎంతమాత్రం ప్రోత్సహించదు’ అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు.(చదవండి : శబరిమలపై విస్తృత ధర్మాసనం)
కాగా కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో హిందుత్వ సంఘాలు, సంఘ్‌పరివార్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం గురువారం సమీక్షించింది. ఇందులో భాగంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులున్న విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment