అనేక జీవనదులకు పుట్టినిళ్లు భారతదేశం. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో నీటి కొరత ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పట్టణాలను మనం చూస్తున్నం. ముంబైలోని లాథూర్‌కి నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి చెన్నై మహానగరంలో కూడా సంభవించింది. ఇంతటి నీటి సమస్య గత వందేళ్లలో కూడా రాలేదని చెన్నై వాసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకముందే కేరళ కళ్లుతెరిచింది. దేశంలో తొలిసారి వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.
తిరువనంతపురం: భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలోభాగంగానే ప్రతి ఏటా వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంతనీటి లభ్యత ఉంది. ఎంత అవసరం కానుంది, వంటి అంశాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. పక్క రాష్ట్రాల కష్టాలను చూసి భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని కేరళ జాగ్రత్త పడుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.కేరళలో ఎంత నీరు అందుబాటులో ఉంటుంది, ఎంత నీరు వాడుకలో ఉంటుంది, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం, అదనపు నీటి కోసం ఉన్న వనరులేంటి? వంటి అంశాల్ని బడ్జెట్‌లో వివరించబోతోంది.
తొలి రాష్ట్రం కేరళనే..
అవసరాల దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నీటి వాడకం మరింత పెరుగుతుందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానమైన అంశం ఏంటంటే... దేశంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం కేరళనే. నీటిని ఎలా పొదుపుచెయ్యాలి, అందుకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాల్ని ఈ బడ్జెట్‌లో చెప్పబోతున్నారు.అలాగే దీనిపై ప్రజలకు, అధికారులకు అవగహన కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఈ ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఎంత నీరు తెలుసుకునే వీలు ఉంటుందని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి కొరత ఉంటే.. అక్కడికి నీటిని ఎలా తరలించాలి, అందుకోసం ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, అంచనా ఖర్చులు ఎంత అన్నది బడ్జెట్‌లో పొందుపరచే అవకాశం ఉంది.
ప్రళయం నుంచి పాఠాలు..
నదులు, చెరువు, బావులు, కుంటలు, రిజర్వాయర్లు ఇలా అన్నింటిలో ఉన్న మొత్తం నీటిని అంచనా వేసి బడ్జె్ట్‌లో చెప్పబోతున్నారు. డిమాండ్‌కి తగినట్లు సప్లై చేసేందుకు ఉన్న మార్గాల్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా పాతవైపోయిన రిజర్వాయర్లు, డ్యాములు, ఇతరత్రా కట్టడాల్ని తిరిగి నిర్మించేందుకు, రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. నీటి ఇంజినీరింగ్ అధికారులు, నీటి పారుదల విభాగం, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. అన్నీ అనుకూలిస్తే..ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కాగా పూర్తిగా కొండ ప్రాంతమైన రాష్ట్రం కావున.. వరదలను నివారించేందుకు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సృష్టించిన ప్రళయం కారణంగా కేరళ అతలాకుతలమయిన విషయం తెలిసిందే. దాని నుంచే దైవభూమి పాఠాలు నేర్చుకున్నట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment