చెన్నై : తమిళనాడులో నీటి ఎద్దడి అంతకంతకూ పెరుగుతోంది. జలాశయాలు ఎండిపోవడంతో చెన్నైతో సహా పలు ప్రాంతాలలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా.. ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం తమిళ ప్రజల పడుతున్న కష్టాలకు చలించిపోయిన కేరళ ప్రభుత్వం తమిళ ప్రజల దాహార్తి తీరుస్తామంటూ ముందుకొచ్చింది. రైలు ద్వారా 20 లక్షల లీటర్ల మంచినీళ్లు సరఫరా చేస్తామని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
అయితే తమ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం తిరస్కరించిందని.. ఇప్పటికైతే ఆ అవసరం లేదని పేర్కొన్నట్లు కేరళ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాలు ముఖం చాటేయడంతో రిజర్వాయర్లన్నీ ఎండిపోయి చెన్నరు, తదితర ప్రాంతాల ప్రజలు తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కథనాల నేపథ్యంలో వారికి కనీసం తాగు నీరైనా అందిద్దామని కేరళ సంకల్పించింది. కానీ కేరళ సాయాన్ని తమిళనాడు తిరస్కరించింది.
కేరళ సాయాన్ని తిరస్కరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ.. ఓ వైపు వర్షాలు లేక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తుంటే.. ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. మంచి మనసుతో కేరళ సీఎం పినరయ్ విజయన్ సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కేరళ సాయాన్ని వద్దునుకోవడం తెలివితక్కువ తనమన్నారు. కేరళ సాయాన్ని అంగీకరించి.. జనాలకు నీటి కరువు నుంచి ఉపశమనం కల్గించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment