తిరువనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమ సెగ ఓ వైపు కొనసాగుతుండగా.. తాజాగా కేరళలో వాటర్ మిలన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అసలు ఈ ఉద్యమం ఏంటో.. ఎందుకు జరుగుతుందో ఓసారి చూద్దాం.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు కీచకులుగా మారి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంటే.. మరికొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలతో తమ వికృతరూపాన్ని బయటపెడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ప్రొఫెసర్ ముస్లిం విద్యార్థినుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రొఫెసర్ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే... కొజికోడ్‌లోని ఫారూక్ ట్రెయినింగ్ కాలేజీలో సోషల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న జౌహర్ మునవీర్.. ‘మా కాలేజీలో 80శాతం మంది అమ్మాయిలే. వారు లెగ్గింగ్స్ ధరిస్తారు. కాళ్లు కనపడేలా పర్దాను పైకెత్తి పట్టుకుంటారు. సున్నితమైన శరీర భాగాల్నికప్పుకునేందుకు ముస్లింలు హిజాబీ(స్కార్ఫ్ వంటిది) ధరిస్తారు. కానీ ఛాతీ భాగం కనపడేట్లుగా చాలా మంది అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేస్తారు.. అలా చేయడం వల్ల మగవారు వారిపైపు ఆకర్షితులవుతారు.. వారు అంతటితో ఆగలేరు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆయనగారి ప్రకోపం చల్లారలేదు. ‘వాటర్ మిలన్ పండిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తారు’ అంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. అసలు అలా ప్రవర్తించడం ఇస్లాంకు విరుద్ధం అంటూ వివాదానికి తెర తీశాడు. ఒక వార్తాసంస్థ ఈ వివాదాన్ని వెలుగులోకి తేవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మహిళా సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
కేరళకు చెందిన మహిళా కార్యకర్తలు దీనికి నిరసనగా వాటర్ మిలన్ ఉద్యమం చేపట్టి ఆందోళన చేస్తున్నారు. ఆర్తీ అనే 25 ఏళ్ల వివాహిత.. ‘అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన వారి శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు’ అంటూ కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్‌మిలన్ ఉద్యమం చేస్తోంది.
ఈ వివాదంపై ఫారూక్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ‘3 నెలల క్రితం జౌహర్ ఒక ప్రైవేటు మీటింగ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వాటితో మా కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక మేము ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని’ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment