కొచ్చి: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఇప్పటికే 45మంది మృతిచెందారు. రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజాగా 12 జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద నీటితో దాదాపు 30 డ్యాములు నిండిపోయి.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు.
మరోవైపు పురాతన ముళ్లపెరియార్ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చిచేరడంతో పూర్తిగా నిండిపోయి.. ప్రమాదస్థాయికి చేరుకుంది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరదను కిందకు వదులుతున్నారు. వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతం భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే.. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంతగా స్లిప్‌వేస్ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు.
నాలుగు రోజులు ఎయిర్‌పోర్టు మూసివేత
కొచ్చి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో నాలుగు రోజులపాటు విమానాశ్రయాన్ని నిలిపివేశారు. మొదటగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. వరద నీరు మరింగా నిలిచిపోవడంతో వరద నీటిని తరలించేందుకు ఇదమలయార్, చెరుతోని డ్యామ్ గేట్లను ఎత్తివేసిన అనంతరం పెరియార్ నదీ తీరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment