బతికుండగానే ప్రిన్సిపాల్కు సమాధి కట్టారు
గత మార్చి 31న కేరళలోని పలక్కాడ్లో గవర్నమెంట్ విక్టోరియా కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ సరసు (56) వచ్చారు. ప్రిన్సిపాల్గా ఆమెకది చివరి రోజు. కాలేజీ ఆవరణంలోకి రాగానే అక్కడి దృశ్యాన్ని చూసి సరసు షాక్ తిన్నారు. కాలేజీ ముందు అంతకుముందే తీసిన ఓ సమాధి కనిపించింది. ఇది ఎవరి సమాధి అని అక్కడున్న ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ అడిగారు. మీదే అంటూ ఆ విద్యార్థి సమాధానం ఇవ్వడంతో సరసు నిర్ఘాంతపోయారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ విచారించగా.. హాస్టల్ విద్యార్థులు ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సమాధి తీసినట్టు తెలిసింది. సరసు మాట్లాడుతూ.. 'తరగతులను బహిష్కరించేందుకు, నిరసన తెలిపేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు నేను అనుమతి ఇవ్వలేదు. కాలేజీలు ఈవెంట్లు, నిరసనల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా అమలు చేశాను. కాబట్టి వారు నాకు వీడ్కోలు బహుమతిగా ఇది (సమాధి) ఇచ్చారు. ఈ ఘటనలో విద్యార్థులకు మాత్రమే కాదు లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉంది' అని చెప్పారు. సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 27 ఏళ్ల పాటు లెక్చరర్గా పాఠాలు చెప్పిన సరసు 8 నెలల పాటు ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఈ కాలేజీలో పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు.