
సాక్షి, లక్నో: సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గాడిన పడుతోందా? తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య చిగురుస్తోందా? ఏమో ఏదైనా జరగవచ్చు అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎందుకంటే.. వచ్చేవారం ఆగ్రాలో జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ సమావేశానికి రావాలని.. ములాయంను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్టీలో తండ్రీ కొడుకుల విబేధాలు తారాస్థాయికి చేరిన తరువాత.. ఇంతటి సామరస్యపూర్వక పలకరింపులు లేవని.. ఈ ఏడు నెలల్లో ఇదే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గురువారం ములాయంను ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా కలిసిన అఖిలేష్ యాదవ్ దాదాపు 20 నిమిషాల సేపు ఆయనతో చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి ఏం చర్చించారన్న విషయంపై స్పష్టత లేకపోయినా.. ఇదొక శుభపరిణామమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ములాయం సింగ్ యాదవ్ కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలోనే ములాయంను అఖిలేష్ ప్రత్యేకంగా కలిసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.