కిరణ్ బేడీ
- బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటన
- పార్టీలో ఎలాంటి అసంతృప్తీ లేదని స్పష్టీకరణ
- శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తామని వ్యాఖ్య
న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడిపోయింది. ఢిల్లీ సీఎం పీఠానికి బీజేపీ తరఫున ఎవరు పోటీ పడతారన్న ఉత్కంఠకు పార్టీ తెర దించింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ(65) ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. కృష్ణానగర్ స్థానం నుంచి ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడతారని వెల్లడించారు.
సోమవారం రాత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలకు కిరణ్ బేడీ నాయకత్వంలో ముందుకు వెళ్లాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ఆమెనే ఉంటారు. కిరణ్ బేడీ కృష్ణానగర్ స్థానం నుంచి పోటీ చేస్తారు’’ అని వెల్లడించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది.
కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కిరణ్ బేడీని చేర్చుకోవడంపై పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న వార్తలను అమిత్ షా తోసిపుచ్చారు. తమ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ తరఫున పోటీ చేసే 62 మంది పేర్లను వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంద రూ మళ్లీ పోటీ చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధినేత సతీశ్ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
బేడీ హర్షం.. తనను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై కిరణ్ బేడీ హర్షం వ్యక్తంచేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ తన హృదయానికి అత్యంత దగ్గరగా ఉందని, నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.
రోజంతా హైడ్రామా..
పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు ఢిల్లీ బీజేపీలో హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసిన సమయంలో ఊహించని విధంగా ఆమెను ఎన్నికల రంగంపైకి తీసుకురావటంపై కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా ఆమెను ప్రకటిస్తారని వచ్చిన వార్తలతో సీనియర్ నేతలు చిన్నబుచ్చుకున్నారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ బేడీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఆమె బీజేపీలో కేవలం ఓ కార్యకర్త మాత్రమేనని, ఆమె అదే భావనలో పార్టీకి సేవ చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
టీ కప్పులో తుపాను..: ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలను బేడీ ఆదివారం తన ఇంటికి టీ పార్టీకి ఆహ్వానించారు. పార్టీ కార్యాలయం ద్వారా వారికి ఆహ్వానాలు పంపారు. దీన్ని ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. మనోజ్ తివారీతో పాటు ఉదిత్‌రాజ్ దానికి హాజరుకాలేదు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆలస్యంగా వచ్చారు. మిగతా ఎంపీలు అంటే రమేష్ బిధూడీ, ప్రవేశ్ వర్మ, మహేష్ గిరీ మీనాక్షీ లేఖీ, విజయ్ గోయల్ ఈ తేనీటి విందుకు హాజరయ్యారు.
ముందస్తుగా నిర్ధారించిన కార్యక్రమం కారణంగా తేనీటి విందుకు హాజరుకాలేకపోయినట్లు ఉదిత్ రాజ్ తెలపగా బేడీ నివాసానికి వెళ్లడం సముచితం కాదని భావించనందువల్ల తాను పార్టీకి వెళ్లలేదని మనోజ్ తివారీ తెలిపారు. బేడీ బీజేపీ సీఎం అభ్యర్థి కాదని, పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని, అందువల్లే తాను హాజరు కాలేదన్నారు. కాగా, బేడీపై అసంతృప్తి వ్యక్తంచేసిన మనోజ్ తివారీని పార్టీ మందలించింది. దాంతో ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలు ఎవరినైనా బాధించినట్లయితే అందుకు విచారిస్తున్నానని చెప్పారు.