'మాట మార్చిన కిరణ్ బేడి'
హైదరాబాద్: ఏడాది క్రితమే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన కిరణ్ బేడి ఇప్పుడు మాట మార్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. జాతిని ఆర్ఎస్ఎస్ ఏకం చేస్తుందన్న కిరణ్బేడి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మత కలహాలు సృష్టించే సంస్థ ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ పై కేంద్రం, రాష్ట్రాలు వ్యాట్, ఎక్సైజ్ పన్నులు వేసి వినియోగదారులపై భారం పెంచుతున్నాయని దిగ్విజయ్ విమర్శించారు. రైతులకు అన్యాయం చేసేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్ను ప్రజల మధ్యలోనే ఎండగడతామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పటిష్టత ఎజెండాగా సాగే చర్చలు ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయని దిగ్విజయ్ తెలిపారు. పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిక అందిస్తామని దిగ్విజయ్ చెప్పారు. పీసీసీ చీఫ్ను విమర్శించే తమ పార్టీ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.