కిరణ్ బేడీని వేడుకుంటున్నా: కేజ్రీవాల్
ఒకరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరొకరు తాజాగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థిని. ఇద్దరూ ఒకప్పుడు మంచి సహచరులే. కానీ తర్వాత విధానాలు మారాయి, దాంతో విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు దయచేసి తనను ఫాలో కానివ్వాలంటూ ఆయన ఆమెను వేడుకుంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ. ఆయన అరవింద్ కేజ్రీవాల్, ఆమె కిరణ్ బేడీ. ఇంతకుముందు తాను ట్విట్టర్లో కిరణ్ బేడీని ఫాలో అయ్యేవాడినని, కానీ ఇప్పుడు తనను బ్లాక్ చేశారని, దయచేసి అన్బ్లాక్ చేయాలంటూ బేడీని కేజ్రీవాల్ వేడుకున్నారు. కానీ దానికి కిరణ్ బేడీ ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. సుమారు 15 నెలల క్రితం ఆయన తనను తాను అరాచకవాదిగా చెప్పుకొన్నప్పుడే కేజ్రీవాల్ను బ్లాక్ చేశానని, ఆయనను ఇక అన్బ్లాక్ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలుకొట్టారు. ఆయన నెగెటివ్ వ్యాఖ్యలు రాస్తున్నారని, తన 40 లక్షల మంది ఫాలోవర్లకు ఆ వ్యాఖ్యలు చూపించి, తన ఖాతాను కలుషితం చేయలేనని చెప్పారు.
ఇక అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నట్లుగా బహిరంగ చర్చ ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదని కూడా కిరణ్ బేడీ చెప్పారు. కేజ్రీవాల్ కేవలం చర్చలనే నమ్ముకుంటారని, తాము మాత్రం సేవలు అందించడాన్నే నమ్ముకుంటామని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయనతో తాను చర్చిస్తానని చెప్పారు. దేశంలోనే మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి అయిన కిరణ్ బేడీ.. పోలీసు విభాగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి కాల ఉద్యమకారిణిగా మారారు. ఇక ఐఆర్ఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కేజ్రీవాల్.. సమాచారహక్కు చట్టం సాధన, అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో ముందుండి అటునుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కిరణ్ బేడీ కూడా అన్నా హజారేకు శిష్యురాలిగానే ఉండేవారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనందుకు కిరణ్ బేడీకి కేజ్రీవాల్ అభినందనలు కూడా తెలిపారు.
.@thekiranbedi congrats 4 being nominated as BJP's CM candidate. I invite u 4 a public debate moderated by neutral person n telecast by all
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015
.@thekiranbedi Kiranji, i used to follow u on twitter. Now, u have blocked me on twitter. Kindly unblock me.
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015