ఆ పార్టీలను ఫూల్స్ చేయండి!
- బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని.. ఆప్‌కు ఓటేయండి
- కేజ్రీవాల్ క్రేజీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆప్‌కే వేయాలంటూ ఢిల్లీ ఓటర్లకు సలహా ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదానికి తెర లేపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఢిల్లీలోని నవాడలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ‘ఇది ఎన్నికల సమయం. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి అభ్యర్థులు డబ్బులిస్తాం... ఓటేయమంటూ మీ వద్దకు వస్తారు. ఆ డబ్బును వద్దనకండి. తీసుకోండి. ఎవరైనా మీ వద్దకు రాకపోతే.. మీరే వారి పార్టీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి మరీ డబ్బులు వసూలు చేయండి. ఆ రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆప్‌కే వేయండి’ అని అన్నారు.
‘గత 65 ఏళ్లుగా మనల్ని పిచ్చోళ్లను చేస్తున్న ఆ నేతలను ఈ సారి మనం ఫూల్స్ చేద్దామ’ని సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్పందించారు. రామ్‌లీలా మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో.. సగం సమయం తనను నక్సలైటుగా, మరోసగం తనను ధర్నాలు చేసేవాడిగా చిత్రించేందుకే సరిపోయిందని విమర్శించారు. సీఎంగా రాజీనామా చేయడం తన తప్పేనని మరోసారి ఒప్పుకున్న కేజ్రీవాల్.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లు మండిపడ్డాయి. అవి ఎన్నికల సంఘం అధికారాలనే ప్రశ్నించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి పేర్కొన్నారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విషయంపై న్యాయ సలహా తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్, పార్టీ అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత తెలిపారు.
సోనియా ఒక సభలో, రాహుల్ రెండు సభల్లో, ఒక రోడ్ షోలో పాల్గొంటారన్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వార్తా చానళ్లు బహిరంగ ప్రదేశాల్లో చర్చా కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. జనవరి 3న ఒక చానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమం షూటింగ్ సందర్భంగా ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి 12 మంది గాయాల పాలయ్యారు.
అందమైన ముఖం బీజేపీకి ఉంది: బేడీ
ఢిల్లీలో బీజేపీకి సరైన ప్రాముఖ్యత, సొంత గుర్తింపు ఉన్న నేత లేకపోవడం వల్లనే కిరణ్ బేడీని ఆ పార్టీలోకి తీసుకున్నారన్న అరవింద్ కేజ్రీవాల్ విమర్శలపై కిరణ్ బేడీ స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీకున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ‘నరేంద్రమోదీ అనే ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం బీజేపీ కలిగి ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘మేమంతా ఆయన చుట్టూ తిరుగుతున్న నక్షత్రాలం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ఆదివారం బీజేపీలో చేరారు.
అర్విందర్ పోటీ చేయరు: కాంగ్రెస్
దేశ రాజధానిలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేయరని ఏఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు వీలుగా ఆయన్ను పోటీ నుంచి విరమింపచేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో తెలిపారు. ఎన్నికల కమిటీ సారథిగా పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్‌ను నియమించిన నేపథ్యంలో అర్విందర్ పోటీకి దూరమవడం గమనార్హం.
‘బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయంపై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ పేరు ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు: అమిత్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పరీక్ష వంటివని, వాటిని తేలిగ్గా తీసుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీలో తమ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారమిక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని దేశమంతా ఆమోదించిందని, ఆయన హవాతో ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.