'ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆరెస్సెస్'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దారుణంగా ఓడిపోవడాన్ని ఆరెస్సెస్ ఇంకా జీర్ణించుకోలేక పోతుంది. పార్టీ నేతలకు కూడా తెలపకుండా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడంపై ఆరెస్సెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయాలపై తమ పత్రిక 'పాంచజన్య' లో భిన్న కథనాలు ప్రచురించింది.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ ఎంపిక సరైనదేనా అని ఆరెస్సెస్ ప్రశ్నించింది. ఢిల్లీ బీజేపీ నేత హర్షవర్ధన్ను లేదా స్థానిక నాయకుడిని ఎవరినైనా బరిలో నిలిపింటే పరిస్థితి భిన్నంగా ఉండేదని అభిప్రాయపడింది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఓటమి నేపథ్యంలో తన పత్రికలో 'ఆకాంక్షోం కి ఉదాన్' (గాలిలో మేడలు ), 'వాదె, సవాల్, కేజ్రీవాల్' (హామీలు, ప్రశ్నలు, కేజ్రీవాల్) శీర్షికలతో రెండు వార్త కథనాలు ప్రచురించింది.
'బీజేపీ ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై ఆధారపడటం కూడా ఓటమికి కారణమైంది. కిరణ్ బేడీ అభ్యర్దిత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... పార్టీలో సమిష్టితత్వం లోపించింది. మరీ ముఖ్యంగా కార్యకర్తల సెంటిమెంట్లను గౌరవించకపోవడం ఓటమికి దారి తీసింది' అని మనోజ్ వర్మ తన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పార్టీ ఓటమికి పలు తప్పిదాలే కారణమని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. కాగా ఆ అంశాలను పాంచజన్యలో ఎన్నికలకు ముందే ప్రచురించడం విశేషం. బీజేపీ నేతలు ఇప్పటికీ పార్టీ ఓటమిపై విశ్లేషిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం.. 'పార్టీకి కంచుకోటగా ఉన్న కృష్ణానగర్ సీటు కోల్పోవడం గమనించినట్లయితే, బీజేపీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నికలలో సహకరించలేదన్నది వాస్తవం' అని విశ్లేషిస్తున్నారు. సీఎం అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు.