![Kolkata mall blasts woman asking for place to breastfeed baby - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/29/mall.jpg.webp?itok=AF5z_KXP)
కోల్‌కతా : బహిరంగ ప్రదేశాల్లో చంటి పిల్లలకు పాలివ్వడం తల్లులకు ఇప్పటికీ నరకప్రాయమేననే ఘటన చోటుచేసుకుంది. ఆకలితో మారాం చేస్తున్న చిన్నారికి పాలుపట్టేందుకు సైతం ఆ భారీ మాల్‌లో అవకాశం లేకుండా పోయింది. కోల్‌కతాలోని భారీ షాపింగ్ మాల్‌లో తన చిన్నారికి పాలుపట్టేందుకు అనువైన ప్రదేశం చూపాలని కోరిన మహిళకు సిబ్బంది నుంచి నిర్ఘాంతపోయే సమాధానం వచ్చింది. కోల్‌కతాలో అత్యంత ప్రముఖ షాపింగ్ మాల్ సౌత్ సిటీ మాల్‌లో 29 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఏడు నెలల పసికందుకు పాలుపట్టేందుకు సరైన ప్రదేశం కోసం మాల్ మొత్తం కలియదిరిగానని ఆమె ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
అంత పెద్ద మాల్‌లో చిన్నారికి తాను పాలిచ్చేందుకు సరైన స్థలమే లేదని, పైగా అక్కడి సిబ్బంది టాయ్‌లెట్‌లో పాలివ్వాలని సూచించారని తెలిపారు. ఇది భారీ మాల్ కాదని..యూజ్‌లెస్ మాల్ అంటూ మండిపడ్డారు. సిబ్బంది తీరుతో అవాక్కైన తనకు వారి నుంచి మరింత నిర్లక్ష్య సమాధానం ఎదురైందని చెప్పుకొచ్చారు. ప్రజల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి పనులన్నీ ఇంట్లో చక్కబెట్టుకుని రావాలని, మాల్‌లో కాదని ఉచిత సలహాలిచ్చారని చెప్పారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆ భారీ మాల్ తన నిర్వాకంతో చిన్నబోయిందని నెటిజన్లు స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment