
ఆఫ్రికన్ విటులను దూరం పెట్టండి
ఎబోలా నేపథ్యంలో కోల్‌కతా సెక్స్‌వర్కర్లకు ఓ స్వచ్ఛంద సంస్థ సూచన
కోల్‌కతా: ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికన్ దేశాలలో విపరీతంగా వ్యాపిస్తున్ నేపథ్యంలో ఆ ఖండానికి చెందిన విటులను దూరం పెట్టండంటూ కోల్‌కతాలోని రెడ్‌లైట్ ప్రాంతమైన సోనాగచిలోని సెక్స్‌వర్కర్లకు ఓ స్వచ్ఛంద సంస్థ సలహా ఇచ్చింది. ఈ రెడ్‌లైట్ ఏరియాకు తరచు వచ్చేవారిలో ఆఫ్రికన్లు సైతం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సెక్స్‌వర్కర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్‌సీ) అనే స్వచ్ఛంద సంస్థ వారికి ఈ సూచన చేసింది.
ఎబోలా వైరస్ సోకిన వారితో శారీరకంగా కలిస్తే అది మీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందని సెక్స్‌వర్కర్లను సంస్థ హెచ్చరించింది. పశ్చిమాఫ్రికాలోని నైజీరియా, లైబీరియా, సియెర్రా లియోన్ లాంటి దేశాల్లో ఎబోలా వైరస్ సోకి వందలాది మంది మరణించడాన్ని అది ఉదహరించింది. ఎబోలా ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికన్లకు దూరంగా ఉండాలని సెక్స్‌వర్కర్లను కోరినట్లు డీఎంఎస్‌సీ సభ్యులొకరు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుసరించి ఎబోలా సోకిన వ్యక్తికుండే రోగ లక్షణాలను గుర్తించేందుకు వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు.