ఈక్వెటార్(కాంగో): ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనాతో విలవిల్లాడుతుంటే.. మరోసారి ఎబోలా వైరస్ పంజా విసురుతోంది. ఈక్వెటార్ ప్రాంతంలోని వంగ్తా హెల్త్ జోన్‌లో ఎబోలా వైరస్ వ్యాధి బయటపడినట్లు కాంగో ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వాంగ్తా ప్రాంతంలో ఆరు ఎబోలా కేసులను గుర్తించామని.. వీరిలో నలుగురు మరణించగా.. ఇద్దరికి వైద్యం చేస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వీటిలో మూడు కేసులను లాబొరేటరి పరీక్షల ద్వారా విశ్లేషించి ఎబోలాగా నిర్థారించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహోచ్‌ఓ) వెల్లడించింది. ఈ క్రమంలో ‘ప్రజలు కోవిడ్-19 గురించే కాక ఇతర మహమ్మారుల మీద కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. డబ్ల్యూహెచ్‌ఓ ఇతర ఆరోగ్య సమస్యలని నిరంతరం పర్యవేక్షిస్తూ.. స్పందిస్తుంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించారు.
కాంగోలో 1976లో మొదటి సారి ఎబోలా వైరస్‌ను గుర్తించిన తర్వాత ఇప్పటికి 11సార్లు అక్కడ వ్యాధి విజృంభించింది. ‘ఇది నిజంగా పరీక్షా సమయం. కానీ డబ్ల్యూహెచ్‌ఓ.. ఆఫ్రికా సీడీసీ వంటి ఇతర సంస్థలతో కలిసి అంటువ్యాధులపై పొరాడే విధంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని బలపర్చేందుకు కృషి చేస్తుంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మస్తిడిసో మోతీ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వాలకు సాయం చేసేందుకు ఇప్పటికే వైద్య బృందాలను అక్కడకు పంపినట్లు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment