కుల్‌భూషణ్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు
కుల్‌భూషణ్ జాదవ్‌ను గూఢచారి అని ప్రకటించి, అతడికి మరణశిక్ష విధించడంపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు భారతదేశంలో పాక్ రాయబారిగా ఉన్న అబ్దుల్ బాసిత్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జాదవ్ ఉగ్రవాది అని, అతడు చేసిన దానికి తలరాత ఎలా ఉంటే అలా అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు చెందిన వార్తా చానల్ సమా టీవీతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో అరెస్టయిన జాదవ్ రా ఏజెంటు అని కూడా సమా టీవీ వ్యాఖ్యానించినా, దాన్ని భారతదేశం పదే పదే ఖండిస్తోంది. తొలుత వాళ్లు తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడతారని, ఇప్పుడు ఒక ఉగ్రవాదిని తాము శిక్షిస్తే ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని బాసిత్ అడిగారు. జాదవ్‌కు మరణశిక్ష విధించడంలో పాక్ తప్పేమీ చేయలేదని కూడా అన్నారు.
తాము అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఎటువైపు నుంచైనా తమకు ఏవైనా బెదిరింపులు వస్తే మాత్రం వాటిని దీటుగా ఎదుర్కోడానికి పాక్ దళాలకు తగిన సామర్థ్యం ఉందని, పూర్తి సన్నద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు.