ఎలుకలు లక్షల లీటర్ల మందు తాగేశాయ్!
పట్నా(బిహార్): బిహార్ రాష్ట్రంలో మూసిక రాజాలు రెచ్చిపోతున్నాయి. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా తొమ్మిది లక్షల లీటర్ల మందు తాగేశాయి. మందు మనుషులు కాకుండా ఎలుకలు తాగటం ఏంటీ, అందులోనా మద్యనిషేధం ఉన్న రాష్ట్రంలో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం అంట.. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు.. సాక్షాత్తూ బిహార్ పోలీసులే చెప్తున్నారు. విషయం ఏమిటంటే.. గత ఏడాది నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలవుతోంది.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ యంత్రాంగం మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. మద్యం అక్రమ విక్రయాలను బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. కొంత స్వాధీనం చేసుకుని పోలీస్ ఠాణాల గోదాముల్లోకి తరలించారు. అయితే, పట్టుబడిన మద్యంలో చాలాభాగం రవాణా చేసేటప్పుడు వృథా అయిందట. ఇదిపోగా దాదాపు 9 లక్షల లీటర్ల మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఠాణాల గోదాముల్లో భద్రపరిచారు. ఇందుకు సంబంధించి ఇటీవల అధికారులు లెక్కలు తీయగా ఆ మద్యం మాయమైందని అధికారులు బదులిచ్చారు.
అదెలాగని అడిగితే.. గోదాముల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని..అవి ఉన్న మందంతా తాగేశాయని చెప్పేశారు. బిత్తరపోయిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలీస్‌స్టేషన్‌లోనే మందు తాగి చిందేసిన ఘటనలో బిహార్ పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ నిర్మల్ సింగ్‌తోపాటు సంఘం సభ్యుడు శంషేర్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.