
ముంబై: తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలోని ఓ ల్యాప్‌టాప్ నుంచి మంటలొచ్చాయి. వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ఈ ఘటన శనివారం జరిగింది. ‘తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ445 విమానం క్యాబిన్‌లో పొగ వాసన వచ్చింది. సీట్ హ్యాట్–ర్యాక్ నుంచి మంటలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.