శ్రీనగర్: గతేడాది దక్షిణ కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ వసీమ్ షా(23)ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో షాతో పాటు అతని అనుచరుడు కూడా హతమయ్యాడు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా పరిగణించే లిట్టర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లలో ఇక్కడ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి.
కొద్దిరోజులుగా షా కదలికలపై నిఘా ఉంచిన జమ్మూ కశ్మీర్ పోలీసులు... లిట్టర్ స్థావరంలో అతడు ఉన్నాడన్న సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ బృందంతో కలసి సోదాలు ప్రారంభించారు. అనుచరుడు నిసార్ అహ్మద్ మీర్‌తో కలసి తప్పించుకోవడానికి షా చేసిన ప్రయత్నం విఫలమైంది. తమ ఉచ్చులో చిక్కుకున్న వారిద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. షోఫియాన్ జిల్లాలోని హెఫ్–శ్రీమాల్‌కు చెందిన వసీమ్ షా అలియాస్ అబు ఒసామా భాయ్ 2014లో లష్కరేలో చేరాడు. పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన అతడు కాలేజ్ డ్రాపౌట్. పాఠశాల రోజుల నుంచే లష్కరేకు మద్దతుగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment