శ్రీనగర్: కశ్మీర్‌లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతనాగ్ జిల్లాలోని బెజ్‌బెహారాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కమాండర్లు సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి వగహామా సుక్తిపొరాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లు పక్కా సమాచారం అందడంతో ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతాబలగాలు అనుమానిత ఇంటిని చుట్టుముట్టగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారిని అనంతనాగ్ జిల్లా లష్కరే కమాండర్ ఆజాద్ అహ్మద్ మాలిక్, జిల్లా హిజ్బుల్ కమాండర్ ఉనైస్ షఫీ, బాసిత్ ఇష్తియాక్, అతిఫ్ నాజర్, ఫిర్‌దౌస్ అహ్మద్, షహీద్ బషీర్‌గా గుర్తించారు. ఈ ఏడాది జూన్ 14న రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షూజాత్ బుఖారిని ఉగ్రవాదులు హత్యచేసిన ఘటనలో ఆజాద్ సూత్రధారి.
Comments
Please login to add a commentAdd a comment