సన్నిధానం : శబరిమలలో ఆదివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు 80 మంది బీజేపీ, ఆర్‌ఎస్సెస్ కార్యకర్తలు అనూహ్యంగా ఆందోళన చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిరసనకారులు తిరువనంతపురంలోని సీఎం పినరయి విజయన్ నివాసాన్ని కూడా ముట్టడించారు. ఆందోళనకారుల అరెస్ట్‌లకు నిరసనగా.. ఆలయ పరిసరాల్లో మోహరించిన పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో బీజేపీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ, ఆర్‌ఎస్సెస్ కార్యకర్తలు అర్థరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైటాయించి రాత్రి సమయాల్లో ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అర్థరాత్రి ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే ఆంక్షలు విధించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, పోలీసులు భక్తులకు వ్యతిరేకం కాదని, వారి క్షేమం కోసం పనిచేస్తారని పోలీస్ అధికారి ప్రతీష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో గత రెండు నెలలుగా ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక భారీ పోలీసు బందోబస్తు మధ్య గత శుక్రవారం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సుప్రీం తీర్పుకు మద్దతునిస్తూ కేరళ ప్రభుత్వం సుమారు 15వేల మంది పోలీసులతో ఆలయ పరిసరాల్లో భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment