నింగిలో నిఘా
ఇసుక మాఫియూ గుట్టు రట్టు, ఆక్రమణదారుల ఆగడాలను పసిగట్టేందుకు ఇక నింగిలో నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మానవ రహిత విమానం సాయంతో ఓ పరికరాన్ని ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్నేహ ప్రియ తయారు చేశారు. ఈ ప్రతిభకు టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డు దక్కింది. సోమవారం ఈ అవార్డును స్నేహ ప్రియ అందుకున్నారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ కబ్జాదారులు రాజ్యమేలుతున్నారు. వీరి గుట్టును రట్టు చేయాలంటే సాహసం చేయాల్సిందే. అయితే, ఇక అలాంటి సాహసం చేయాల్సిన అవసరం లేదు. నదీ తీరాల సమీపంలోని కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకుని కూర్చుంటే చాలు మానవ రహిత విమానంలో పొందు పరచిన టెక్నాలజీ ఇసుక మాఫియా గుట్టును రట్టు చేసి, వారి కదలికల్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌కు చేరవేస్తుంది. ఈ పరికరాన్ని ఈశ్వరీ ఇంజనీరింగ్ క ళాశాల బిటెక్ విద్యార్థిని ఆర్ స్నేహ ప్రియ సిద్ధం చేశారు. ప్రాజెక్టు సూపర్ వైజర్ డాక్టర్ కె కదిర వన్ ప్రోత్సాహంతో ఆటో పైలట్ సిస్టమ్ పేరిట దీనిని రూపొందించారు.
టీసీఎస్ అవార్డు : ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల పరిధిలోని ఈశ్వరీ ఇంజనీరింగ్ కళాశాల టీఆర్‌పీ ఆడిటోరియంలో సోమవారం టీసీఎస్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో స్నేహప్రియ ప్రతిభను గురించి ప్రాజెక్టు సూపర్ వైజర్, ఆ కళాశాల డీన్ డాక్టర్ కే కదిరవన్ వివరిస్తూ, ఇసుకు మాఫియా, ఆక్రమణదారుల కదలికల్ని పసిగట్టడమే లక్ష్యంగా ఈ పరికరాన్ని సిద్ధం చేశామన్నారు. మానవ రహిత విమానంలో పొందుపరిచిన ఆటో పైలట్ సిస్టమ్‌ను నదీ తీరాల్లో వదలి పెడితే, సమీపంలో ఏర్పాటు చేసుకున్న కంట్రోల్ రూంకు ఇసుక మాఫియూ కదలికల వివరాలు చేరుతాయని వివరించారు. ఇందులో పీఐడీ కంట్రోల్ సిస్టమ్, యూఏవీ, మైక్రో కంట్రోల్, జీపీఎస్‌లను అమర్చామన్నారు. అలాగే, ఏసీడీ (యాంటీ కొల్యుషన్ డివైజ్) టెక్నాలజీని అమర్చడం ద్వారా మానవ రహిత విమానానికి ఎలాంటి ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు లేవన్నారు. ఏదైనా ఎత్తై ప్రదేశం ఎదురైనా, గుట్టలు, కొండలు ఎదురైనా వాటిని ఢీ కొట్టేందుకు చాన్స్ లేదన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా తన దిశను మానవ రహిత విమానం మార్చుకుంటుందన్నారు.
ఒక వేళ బ్యాటరీ, ఇంధనం ఖాళీ అయినా, సురక్షితంగా ఈ విమానం కిందకు ల్యాండ్ అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పయనించిన హెలికాప్టర్‌లో ఏసీడీ పరికరం ఉంటే, ఆ కొండను ఢీ కొట్టి ఉండేది కాదని ఉదాహరించారు. ఈ మానవ రహిత విమానం ఎక్కడి నుంచి బయలు దేరుతుందో అక్కడికే తిరిగి వచ్చి ల్యాండ్ అవుతుందని, అందుకు తగ్గ టెక్నాలజీని ఉపయోగించినట్లు వివరించారు. అందుకే తమ పరికరం టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ పరికరాన్ని కాంచీపురం జిల్లా పరిధిలోని నదీ తీరాల్లో ప్రయోగించామని, అక్కడ ఇసుక మాఫియా కదలికలపై ఎస్‌ఎంఎస్ సమాచారాన్ని ఆయా ప్రాంత తహసీల్దార్, వీఏవోలకు పంపినట్టు వెల్లడించారు. పది వేల అడుగుల వరకు ఈ మానవ రహిత విమానాన్ని ప్రయోగించేందుకు వీలుందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు వీలుందని, అందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.
ప్రదానోత్సవం: తన ప్రతిభతో పరికరాన్ని సిద్ధం చేసిన స్నేహ ప్రియకు టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డును బంగారు పతకంతో ప్రదానం చేశారు. రూ.పది వేలు నగదు బహుమతి అందజేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్(టీసీఎస్) ప్రతినిధులు పట్టాభిరాం, రాంకుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ విద్యా సంస్థలు రామాపురం, తిరుచ్చి క్యాంపస్ చైర్మన్ ఆర్ శివకుమార్ మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థినికి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను పరిశోధనల పరంగా ప్రోత్సహించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. అవకాశాలను అంది పుచ్చుకుని ప్రతి విద్యార్థి తమ ప్రతిభకు పదును పెట్టాలని సూచించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ రిజిస్ట్రార్ సేతురామన్ మాట్లాడుతూ, ఈ అవార్డు ప్రతి విద్యార్థికి ఆదర్శవంతం కావాలన్నారు. అవార్డులు లక్ష్యంగా తమ మేధా సంపతికి విద్యార్థులు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం శేఖర్, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఈ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.