Unmanned aircraft
-
గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది. మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. -
పైలట్ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. విమానం చక్కగా ఎగిరిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. -
స్క్రామ్‌జెట్ పరీక్ష సక్సెస్
బాలాసోర్: హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్ఎస్టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్ఎస్టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు. -
నింగిలో నిఘా
ఇసుక మాఫియూ గుట్టు రట్టు, ఆక్రమణదారుల ఆగడాలను పసిగట్టేందుకు ఇక నింగిలో నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మానవ రహిత విమానం సాయంతో ఓ పరికరాన్ని ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్నేహ ప్రియ తయారు చేశారు. ఈ ప్రతిభకు టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డు దక్కింది. సోమవారం ఈ అవార్డును స్నేహ ప్రియ అందుకున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ కబ్జాదారులు రాజ్యమేలుతున్నారు. వీరి గుట్టును రట్టు చేయాలంటే సాహసం చేయాల్సిందే. అయితే, ఇక అలాంటి సాహసం చేయాల్సిన అవసరం లేదు. నదీ తీరాల సమీపంలోని కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకుని కూర్చుంటే చాలు మానవ రహిత విమానంలో పొందు పరచిన టెక్నాలజీ ఇసుక మాఫియా గుట్టును రట్టు చేసి, వారి కదలికల్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌కు చేరవేస్తుంది. ఈ పరికరాన్ని ఈశ్వరీ ఇంజనీరింగ్ క ళాశాల బిటెక్ విద్యార్థిని ఆర్ స్నేహ ప్రియ సిద్ధం చేశారు. ప్రాజెక్టు సూపర్ వైజర్ డాక్టర్ కె కదిర వన్ ప్రోత్సాహంతో ఆటో పైలట్ సిస్టమ్ పేరిట దీనిని రూపొందించారు. టీసీఎస్ అవార్డు : ఎస్ఆర్ఎం విద్యా సంస్థల పరిధిలోని ఈశ్వరీ ఇంజనీరింగ్ కళాశాల టీఆర్పీ ఆడిటోరియంలో సోమవారం టీసీఎస్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో స్నేహప్రియ ప్రతిభను గురించి ప్రాజెక్టు సూపర్ వైజర్, ఆ కళాశాల డీన్ డాక్టర్ కే కదిరవన్ వివరిస్తూ, ఇసుకు మాఫియా, ఆక్రమణదారుల కదలికల్ని పసిగట్టడమే లక్ష్యంగా ఈ పరికరాన్ని సిద్ధం చేశామన్నారు. మానవ రహిత విమానంలో పొందుపరిచిన ఆటో పైలట్ సిస్టమ్‌ను నదీ తీరాల్లో వదలి పెడితే, సమీపంలో ఏర్పాటు చేసుకున్న కంట్రోల్ రూంకు ఇసుక మాఫియూ కదలికల వివరాలు చేరుతాయని వివరించారు. ఇందులో పీఐడీ కంట్రోల్ సిస్టమ్, యూఏవీ, మైక్రో కంట్రోల్, జీపీఎస్‌లను అమర్చామన్నారు. అలాగే, ఏసీడీ (యాంటీ కొల్యుషన్ డివైజ్) టెక్నాలజీని అమర్చడం ద్వారా మానవ రహిత విమానానికి ఎలాంటి ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు లేవన్నారు. ఏదైనా ఎత్తై ప్రదేశం ఎదురైనా, గుట్టలు, కొండలు ఎదురైనా వాటిని ఢీ కొట్టేందుకు చాన్స్ లేదన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా తన దిశను మానవ రహిత విమానం మార్చుకుంటుందన్నారు. ఒక వేళ బ్యాటరీ, ఇంధనం ఖాళీ అయినా, సురక్షితంగా ఈ విమానం కిందకు ల్యాండ్ అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పయనించిన హెలికాప్టర్లో ఏసీడీ పరికరం ఉంటే, ఆ కొండను ఢీ కొట్టి ఉండేది కాదని ఉదాహరించారు. ఈ మానవ రహిత విమానం ఎక్కడి నుంచి బయలు దేరుతుందో అక్కడికే తిరిగి వచ్చి ల్యాండ్ అవుతుందని, అందుకు తగ్గ టెక్నాలజీని ఉపయోగించినట్లు వివరించారు. అందుకే తమ పరికరం టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ పరికరాన్ని కాంచీపురం జిల్లా పరిధిలోని నదీ తీరాల్లో ప్రయోగించామని, అక్కడ ఇసుక మాఫియా కదలికలపై ఎస్ఎంఎస్ సమాచారాన్ని ఆయా ప్రాంత తహసీల్దార్, వీఏవోలకు పంపినట్టు వెల్లడించారు. పది వేల అడుగుల వరకు ఈ మానవ రహిత విమానాన్ని ప్రయోగించేందుకు వీలుందన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు వీలుందని, అందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. ప్రదానోత్సవం: తన ప్రతిభతో పరికరాన్ని సిద్ధం చేసిన స్నేహ ప్రియకు టీసీఎస్ ఉత్తమ ప్రాజెక్టు అవార్డును బంగారు పతకంతో ప్రదానం చేశారు. రూ.పది వేలు నగదు బహుమతి అందజేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్(టీసీఎస్) ప్రతినిధులు పట్టాభిరాం, రాంకుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎస్ఆర్ఎం గ్రూప్ విద్యా సంస్థలు రామాపురం, తిరుచ్చి క్యాంపస్ చైర్మన్ ఆర్ శివకుమార్ మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థినికి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను పరిశోధనల పరంగా ప్రోత్సహించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. అవకాశాలను అంది పుచ్చుకుని ప్రతి విద్యార్థి తమ ప్రతిభకు పదును పెట్టాలని సూచించారు. ఎస్ఆర్ఎం వర్సిటీ రిజిస్ట్రార్ సేతురామన్ మాట్లాడుతూ, ఈ అవార్డు ప్రతి విద్యార్థికి ఆదర్శవంతం కావాలన్నారు. అవార్డులు లక్ష్యంగా తమ మేధా సంపతికి విద్యార్థులు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం శేఖర్, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఈ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం
లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం ‘ఎక్స్-37బీ’ ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యే అంతరిక్ష విమానం తయారీలో భాగంగా.. అమెరికా ఈ బుల్లి మానవ రహిత విమానాన్ని రహస్యంగా పరీక్షిస్తోంది. 8.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం మూడోసారి విజయవంతంగా తిరిగిరావడంతో.. అంతరిక్ష విమాన తయారీలో కీలక ప్రగతి సాధించినట్లైందని అమెరికా వాయుసేన ప్రకటించింది. కాగా, ప్రస్తుతం అమెరికా వద్ద బోయింగ్ కంపెనీ రహస్యంగా తయారుచేసిన రెండు ‘ఎక్స్-37బీ’ అంతరిక్ష విమానాలు ఉన్నాయని ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది. -
ఇక వారిపై ఆశల్లేనట్టేనా?
►గుండెల్ని మెలిపెడుతున్న హిమాచల్ ఘోరం ►ఇంకో 18 మంది విద్యార్థుల కోసం కన్నవారి ఎదురుచూపులు ►రంగంలోకి మానవరహిత విమానాలు: మర్రి ►సైన్యం సాయం కూడా కోరాం: నాయిని మండి, సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నాయి. ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆదివారం హిమాచల్ దుర్ఘటనలో గల్లంతైన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలతో తిరిగొచ్చే అవకాశాలు దాదాపుగా మృగ్యంగానే కన్పిస్తున్నాయి. మండి జిల్లాలో లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా వచ్చి పడ్డ వరద ధాటికి బియాస్ నదిలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల్లో బుధవారం మరొకరు విగత జీవుడై దొరికారు. అతన్ని హైదరాబాద్ శివరాంపల్లికి చెందిన సాబేర్ హుస్సేన్‌గా గుర్తించారు. లార్జి డ్యామ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నదిలో లోతైన ప్రదేశంలో గజ ఈతగాళ్లు అతని మృతదేహాన్ని కనిపెట్టారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. శవాన్ని గుర్తు పట్టిన అతని తల్లి ఆయేషా బేగం గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఊరడించడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాన్ని రోడ్డు మార్గాన కులుమనాలికి తరలించారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాద్ చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం నలుగురు, మంగళవారం ఒక విద్యార్థి మృతదేహాలను వెలికితీయడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా ఆరుగురు విద్యార్థుల శవాలు దొరికాయి. మరో 18 మంది విద్యార్థులతో పాటు టూర్ ఆపరేటర్ ఆచూకీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వారందరి కుటుంబీకులూ బియాస్ నది వద్ద కంటిపై కునుకు కూడా లేకుండా నిస్సహాయంగా ఎదురుతెన్నులతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఎలాగైనా తమవారి జాడ తీయాలంటూ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని వారు వేడుకుంటున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. లార్జి-పండో డ్యామ్‌ల మధ్య 17 కి.మీ. దూరాన్ని ఏడు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, దుర్ఘటనకు సంబంధించి లార్జి డ్యామ్ అధికార వర్గాలపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ప్రాణాపాయం కలిగించడం), 304-ఎ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం) సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు మండి ఎస్పీ ఆర్ఎస్ నేగీ తెలిపారు. విద్యార్థులతో పాటు పర్యటనకు వెళ్లిన ఉపాధ్యాయుడు ఎ.ఆదిత్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వివరించారు. విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శల నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. అన్నీ ఆటంకాలే...: సహాయ చర్యలకు వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. బుధవారం మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపేశారు. బియాస్ నది నిండా బండలుండటం, పూడిక పేరుకుపోవడంతో పాటు ప్రవాహం ఉధృతంగా ఉండటం సమస్యగా మారాయని ఎన్డీఆర్ఎఫ్ బృందాల కమాండింగ్ అధికారి జైదీప్‌సింగ్ చెప్పారు. విద్యార్థులు బండల కిందో, పూడికలోనో చిక్కిపోయి ఉండొచ్చన్నారు. ‘‘ఆచూకీ చిక్కని విద్యార్థుల్లో ఎవరూ బతికుండే అవకాశాల్లేవు. బహుశా గురువారానికల్లా మృతదేహాలు నీటిపైకి తేలవచ్చని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గాలింపును ఉధృతం చేస్తామని స్థానికంగా మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉదయమే వీలైనంత త్వరగా రంగంలోకి దిగుతామని ‘సాక్షి’కి చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందన్నారు. తమ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వెలికితీత చర్యలను వేగవంతం చేసేందుకు కనీసం 500 మంది సైనికులను పంపాల్సిందిగా కోరినట్టు చెప్పారు. మానవరహిత విమానాలు సహా గాలింపుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జాతీయ విపత్తు సంస్థ (ఎన్డీ ఎంఏ) కూడా నిర్ణయించింది. బుధవారం ఎన్డీఎంఏ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘మానవరహిత విమానంతో ఉపరితలం నుంచి ఫొటోలు తీయడంతో పాటు నీటి అడుగున పని చేసే కెమెరాలను కూడా వినియోగిస్తాం. గువాహటి, కోల్‌కతా, పాట్నాల నుంచి అనుభవ జ్ఞులైన గజ ఈతగాళ్లను పిలిపిస్తున్నాం’’ అని మర్రి చెప్పారు. ఆయన గురువారం ఘటనా స్థలికి వెళ్తారని సమాచారం.