ఇక వారిపై ఆశల్లేనట్టేనా? | no more hopes on missing students in himachal pradesh | Sakshi
Sakshi News home page

ఇక వారిపై ఆశల్లేనట్టేనా?

Published Thu, Jun 12 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

ఇక వారిపై ఆశల్లేనట్టేనా?

ఇక వారిపై ఆశల్లేనట్టేనా?

గుండెల్ని మెలిపెడుతున్న హిమాచల్ ఘోరం
ఇంకో 18 మంది విద్యార్థుల కోసం కన్నవారి ఎదురుచూపులు
రంగంలోకి మానవరహిత విమానాలు: మర్రి
సైన్యం సాయం కూడా కోరాం: నాయిని


 మండి, సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నాయి. ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆదివారం హిమాచల్ దుర్ఘటనలో గల్లంతైన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలతో తిరిగొచ్చే అవకాశాలు దాదాపుగా మృగ్యంగానే కన్పిస్తున్నాయి. మండి జిల్లాలో లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా వచ్చి పడ్డ వరద ధాటికి బియాస్ నదిలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల్లో బుధవారం మరొకరు విగత జీవుడై దొరికారు. అతన్ని హైదరాబాద్ శివరాంపల్లికి చెందిన సాబేర్ హుస్సేన్‌గా గుర్తించారు. లార్జి డ్యామ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నదిలో లోతైన ప్రదేశంలో గజ ఈతగాళ్లు అతని మృతదేహాన్ని కనిపెట్టారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. శవాన్ని గుర్తు పట్టిన అతని తల్లి ఆయేషా బేగం గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఊరడించడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాన్ని రోడ్డు మార్గాన కులుమనాలికి తరలించారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాద్ చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం నలుగురు, మంగళవారం ఒక విద్యార్థి మృతదేహాలను వెలికితీయడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా ఆరుగురు విద్యార్థుల శవాలు దొరికాయి.

మరో 18 మంది విద్యార్థులతో పాటు టూర్ ఆపరేటర్ ఆచూకీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వారందరి కుటుంబీకులూ బియాస్ నది వద్ద కంటిపై కునుకు కూడా లేకుండా నిస్సహాయంగా ఎదురుతెన్నులతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఎలాగైనా తమవారి జాడ తీయాలంటూ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని వారు వేడుకుంటున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. లార్జి-పండో డ్యామ్‌ల మధ్య 17 కి.మీ. దూరాన్ని ఏడు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, దుర్ఘటనకు సంబంధించి లార్జి డ్యామ్ అధికార వర్గాలపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ప్రాణాపాయం కలిగించడం), 304-ఎ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం) సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు మండి ఎస్పీ ఆర్‌ఎస్ నేగీ తెలిపారు. విద్యార్థులతో పాటు పర్యటనకు వెళ్లిన ఉపాధ్యాయుడు ఎ.ఆదిత్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వివరించారు. విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శల నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

అన్నీ ఆటంకాలే...: సహాయ చర్యలకు వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. బుధవారం మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపేశారు. బియాస్ నది నిండా బండలుండటం, పూడిక పేరుకుపోవడంతో పాటు ప్రవాహం ఉధృతంగా ఉండటం సమస్యగా మారాయని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల కమాండింగ్ అధికారి జైదీప్‌సింగ్ చెప్పారు. విద్యార్థులు బండల కిందో, పూడికలోనో చిక్కిపోయి ఉండొచ్చన్నారు. ‘‘ఆచూకీ చిక్కని విద్యార్థుల్లో ఎవరూ బతికుండే అవకాశాల్లేవు. బహుశా గురువారానికల్లా మృతదేహాలు నీటిపైకి తేలవచ్చని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గాలింపును ఉధృతం చేస్తామని స్థానికంగా మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

ఉదయమే వీలైనంత త్వరగా రంగంలోకి దిగుతామని ‘సాక్షి’కి చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోందన్నారు. తమ ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వెలికితీత చర్యలను వేగవంతం చేసేందుకు కనీసం 500 మంది సైనికులను పంపాల్సిందిగా కోరినట్టు చెప్పారు. మానవరహిత విమానాలు సహా గాలింపుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జాతీయ విపత్తు సంస్థ (ఎన్‌డీ ఎంఏ) కూడా నిర్ణయించింది. బుధవారం ఎన్‌డీఎంఏ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘మానవరహిత విమానంతో ఉపరితలం నుంచి ఫొటోలు తీయడంతో పాటు నీటి అడుగున పని చేసే కెమెరాలను కూడా వినియోగిస్తాం. గువాహటి, కోల్‌కతా, పాట్నాల నుంచి అనుభవ జ్ఞులైన గజ ఈతగాళ్లను పిలిపిస్తున్నాం’’ అని మర్రి చెప్పారు. ఆయన గురువారం ఘటనా స్థలికి వెళ్తారని సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement