
త్వరలో ఎంపీలకు డబుల్ హైక్!
న్యూఢిల్లీ: త్వరలో పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారు పొందుతున్న జీతభత్యాలకంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీట జీతాలు రెట్టింపును ఖరారు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీకి రూ.50 వేలు చెల్లిస్తుండగా అది లక్షకు పెరగనుంది. అలాగే కార్యాలయ ఖర్చులు, నియోజకవర్గ అలవెన్సులు రూ.45 వేలు చెల్లిస్తుండగా దానిని 90 వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులో మరో లక్ష అందనున్నాయి.
ఇలా ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే మొత్తం రూ.2.8లక్షల జీతభత్యాలు ఒక్కో లోక్ సభ, రాజ్యసభ సభ్యుడికి అందనున్నాయి. అయితే, చాలామంది నేతలకు తమ జీతాలను పెంచడం మాత్రం ఇష్టం లేదట. ఐటీ డిపార్ట్ మెంట్ వల్ల చిక్కులు వస్తాయని, అందుకే తమ అలవెన్సులు మాత్రం పెంచితే చాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2010లో ఒకసారి పార్లమెంటు సభ్యులకు జీతభత్యాలు పెంచారు. తిరిగి పెంచేందుకు ఇదే తగిన సమయం అని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో వారి జీతాల పెంపు అంశాన్ని సభ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.