
డెహ్రాడూన్ : తాడుసహాయంతో నదిని దాటి మరీ విద్యార్థులకు చదువు చెప్పాలనుకున్న ఉపాధ్యాయుల ఉక్కు సంకల్పాన్ని చూసి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో పితోర్‌ఘర్‌లోని బ్రిడ్జ్ కూలిపోయింది. పాఠశాలకు, కొందరు టీచర్లు నివాసముంటున్న ప్రాంతానికి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది. అయితే ఎలాగైనా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లాలని జోధ్ సింగ్ కున్వర్‌తో పాటూ మరో టీచర్ భావించారు. దీంతో స్థానిక వ్యక్తి సహాయంతో నదికి రెండు వైపులా ఓ తాడును బిగించారు. పొంగిపొర్లుతున్న నదిపై నుంచి దాదాపు 30 మీటర్ల దూరం తాడు సహాయంతో దాటారు. జూలై చివర్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌ఇంట్లో వైరల్ అవుతోంది. అసాధారణమైన ఉపాధ్యాయులకు హ్యాట్సాఫ్ అంటూ మంగళవారం వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్ చేశారు.
Jodh Singh Kunwar, a school teacher in Uttarakhand’s Pithoragarh along with few other teachers took the route of rappelling on a 30mtr long zip line to work after a bridge that links two banks fell apart,to reach their students.Hats off to such extraordinarily committed teachers pic.twitter.com/eX3Yyvcq5R
— VVS Laxman (@VVSLaxman281) August 14, 2018
కాగా, గత 20 రోజులుగా ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు 48 గంటల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.