వలస కార్మికులకు ఉపాధి ఎలా? | At Least 23 Million Migrants Returning to India villages | Sakshi
Sakshi News home page

వలస కార్మికులకు ఉపాధి ఎలా?

Published Wed, May 27 2020 3:53 PM | Last Updated on Wed, May 27 2020 3:54 PM

At Least 23 Million Migrants Returning to India villages - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ఇంటి బాట పట్టిన విషయం తెల్సిందే. అలాంటి వారు దాదాపు 2.30 కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస పోయిన వారే గురించే ఈ ప్రస్థావన. 2011లో నిర్వహించిన సెన్సెస్‌ లెక్కల ప్రకారం 1.78 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలస పోయారు. (‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ కన్నీటి కథ)

అప్పటి నుంచి గ్రామాల నుంచి వలస పోయిన కార్మికులు సంఖ్య ఏటా కనిష్టంగా 2.8 శాతం పెరిగిందనుకుంటే వారి సంఖ్య 2.30 కోట్లకు చేరుకుని ఉంటుంది. వారంతా ఇప్పుడు గ్రామీణ బాట పట్టారు. వారందరికి పునరావాసం కల్పించే ఆర్థిక బలం గ్రామీణ ప్రాంతాలకు ఉందా? మహాత్మా గాంధీ ఉపాధి గ్యారంటీ హామీ పథకాన్ని వారందరికి విస్తరించవచ్చా? గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తామంటూ లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా?

2017 నాటి ‘నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం దేశంలోని 70 శాతం జనాభాను గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే పోషిస్తోంది. 2017–18 నాటి కార్మిక సర్వే కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 71 శాతం ఉన్నప్పటికీ ఉత్పత్తి శక్తి మాత్రం పట్టణాల్లో ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటున్న దాదాపు 2.30 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోసం తిరిగి వలసలు పోవాల్సిన అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కేంద్రం నిజంగా ప్రోత్సహించినట్లయితే పట్టణ, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మధ్యనున్న వ్యత్యాసం తగ్గుతుంది. అది నవీన గ్రామీణ భారతం ఆవిష్కరణకు దారి తీస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement