ఆస్కార్ బరిలో మన చిత్రం.. 'లయర్స్ డైస్'
జాతీయ అవార్డు పొందిన హిందీ చిత్రం 'లయర్స్ డైస్'కు ఆస్కార్ ఎంట్రీ లభించింది. 87వ అకాడమీ అవార్డుల బరిలో గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఈ చిత్రానికి అవకాశం వచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) నియమించిన 12 మంది సభ్యుల జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈసారి అత్యధికంగా రికార్డు స్థాయిలో 30 సినిమాలు దీనికోసం పోటీ పడ్డాయి.
వీటిలోంచి లయర్స్ డైస్ను భారతదేశం తరఫున విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డు కోసం పంపుతున్నట్లు ఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సుప్రాణ్ సేన్ తెలిపారు. మళయాళ నటి గీతూ మోహన్దాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి తీసిన ఈ సినిమాలో తన మూడేళ్ల కూతురితో కలిసి ఓ మహిళ.. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతుంటుంది. దారిలో వాళ్లకు సైన్యం నుంచి బయటికొచ్చిన ఓ వ్యక్తి కలుస్తాడు. అతడు వారు తమ గమ్యాన్ని చేరుకునేవరకు తోడుంటాడు. 61వ జాతీయ సినిమా అవార్డులలో ఈ సినిమాకుగాను గీతాంజలికి ఉత్తమనటి అవార్డు, రాజీవ్ రాయ్కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చాయి.