
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయితో తనకు ఆరున్నర దశాబ్ధాల స్నేహం ఉందని బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ గుర్తుచేసుకున్నారు. తామిద్దరం కలిసి సినిమాలు చూశామని, ఎన్నో పుస్తకాలు చదివామని అన్నారు. అటల్‌జీ మరణం తమందరికీ తీరని నష్టమని చెప్పారు. వాజ్‌పేయి గొప్ప నేతని, ఆయన మరణంతో రాజకీయ వ్యవస్థలో శూన్యత ఏర్పడిందని అద్వానీ అన్నారు.
ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. అటల్‌జీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన నుంచి విలువైన పాఠాలను తాను స్వీకరించానని అద్వానీ చెప్పుకొచ్చారు. తాను ఎన్నో బహిరంగ సభల్లో ప్రసంగించినా అటల్‌జీ పరోక్షంలో ఇలాంటి సమావేశంలో మాట్లాడతానని తాను ఊహించలేదన్నారు. తాను రచించిన పుస్తకావిష్కరణ సభలో వాజ్‌పేయి లేకపోవడం తనను బాధించిందని దివంగత నేతకు నివాళులర్పిస్తూ అద్వానీ పేర్కొన్నారు.
రాజీ ఎరుగని వాజ్‌పేయి : మోదీ
పార్లమెంట్‌లో పలు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నా ఎన్నడూ తన సిద్ధాంతాలతో వాజ్‌పేయి రాజీపడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత విలువలతో కూడిన పార్లమెంటేరియన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాలకు వాజ్‌పేయి వన్నెలద్దారని కొనియాడారు. ఎక్కడా ఘర్షణలు, అశాంతికి చోటులేకుండా ఏకాభిప్రాయంతో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
కేవలం ఒక పార్టీ అధికారం చెలాయిస్తున్న రోజుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాజ్‌పేయి నిత్యం ప్రజల కోసం పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురు రామ్‌దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఇతర విపక్ష నేతలతో పాటు అటల్ బిహారి వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనుమరాలు నీహారిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment