అలాంటి వారి తలలు నరికేసే వాణ్ని: రాందేవ్
చండీగఢ్: యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మాతకీ జై' అని అనని వారిని తాను తలనరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చేయడం లేదని ఆయన అన్నారు. 'భారత్ మాతకీ జై' అనే నినాదం చేయడమంటే మాతృభూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని పేర్కొన్నారు.
రాందేవ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. 'ఆరెస్సెస్ భేటీలో రాందేవ్ మాట్లాడుతూ తలలు నరికేస్తానని హెచ్చరించారు. ఇది హింసకు పిలుపునివ్వడమే. ప్రజలను బెదిరించడమే. ప్రధాని మోదీ రాందేవ్‌పై చర్య తీసుకోవాలి' అంటూ కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ట్వీట్ చేశారు. 'భారత్ మాతకీ జై' అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ 'దారుల్ ఉలూమ్ డియోబంద్' ఇటీవల ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము కూడా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నామని, తాము అందుకు బదులుగా 'హిందూస్తాన్ జిందాబాద్' అని నినదిస్తామని పేర్కొంది. అదేవిధంగా ముస్లిం నాయకుడైన అసదుద్దీన్ ఒవైసీ కూడా మతపరమైన ఆంక్షల వల్ల తాము ఆ నినాదాన్ని చేయబోమని పేర్కొన్నాడు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ 'భారత్ మాతకీ జై' అనని వాళ్లు దేశం విడిచివెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ అంశంపై చర్చ తీవ్రమైంది. మరోవైపు 'భారత్ మాతకీ జై' అంటేనే దేశభక్తులా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.