సాక్షి, ముంబై: ఉప నగరంలోని జోగేశ్వరి, గోరేగావ్ ప్రజలకు పశ్చిమ రైల్వే నూతన సంవత్సర కానుక అందజేయనుంది. హార్బర్ మార్గంలో జనవరి ఒకటో తేదీ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ (సీఎస్‌ఎంటీ) నుంచి నేరుగా గోరేగావ్ వరకు లోకల్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జోగేశ్వరి, గోరేగావ్ వెళ్లే ప్రయాణికులు ఇక అంధేరీలో రైలు మారాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం హార్బర్ రైల్వే మార్గంలో సీఎస్‌ఎంటీ నుంచి అంధేరి వరకు లోకల్ రైళ్లు నడుస్తున్నాయి. అంధేరి నుంచి గోరేగావ్ వరకు విస్తరించే పనులు ఇటీవల పూర్తికావడంతో ఇక సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర రైల్వే మంత్రి పియుష్ గోయల్ చేతుల మీదుగా జరిగేలా అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై పర్యటన ఖరారైతే స్వయంగా ఆయన చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. ఒకవేళ ఆయన షెడ్యుల్ బిజీ ఉంటే ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభోత్సవం చేసే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు.
అదేవిధంగా ప్రస్తుతం చర్చిగేట్-బోరివలి మధ్య నడుస్తున్న ఏసీ లోకల్ రైలును విరార్ వరకు విస్తరించే కార్యక్రమం కూడా గోయల్ చేతుల మీదుగా జరుగనుంది. బోరివలి స్టేషన్‌లో ఏసీ లోకల్ రైలుకు పచ్చ జెండ చూపించనున్నారు. ఆ తరువాత చర్చిగేట్-విరార్ ట్రిప్పులు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment