Local train services
-
ప్రయాణికులకు శుభవార్త, రైలు కూతకు గజ్వేల్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా గజ్వేల్ రైల్వే స్టేషన్ ఎదగబోతోంది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరిగి విస్తరణకు అవకాశం లేకపోవడంతో సిటీకి దగ్గరగా ఉన్న (60 కి.మీ.) గజ్వేల్ స్టేషన్‌పై రైల్వే అధికారులు దృష్టి పడింది. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నారు. కుదిరితే కొన్నింటిని జనవరి నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారు. గజ్వేల్ నుంచి త్వరలో కాచిగూడకు డెమూ సర్వీసునూ నడపాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో కీలక రైల్వేస్టేషన్‌గా గజ్వేల్ మారే అవకాశముంది. విస్తరణకు వీలు లేక.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల విస్తరణకు స్థలం లేక ఇబ్బందిగా మారింది. ప్రస్తుత రైళ్ల తాకిడిని అవి తట్టుకోలేకపోతున్నాయి. కొత్త రైళ్లను ప్రారంభించడం అసాధ్యంగా మారింది. ఒక స్టేషన్ నుంచి రైలు మొదలవ్వాలంటే ముందు దానికి మెయింటెనెన్స్ పనులు జరపాలి. దూరప్రాంతా లకు వెళ్లే రైళ్లకు ఈ పనులు మరింత కఠినంగా ఉంటాయి. రైళ్ల అవసరాల ప్రకారం 3 రకాల మెయింటెనెన్స్ పనులుంటాయి. ఇంజిన్, బ్రేకులు, లింకులు, ఏసీ.. ఇలా అన్నింటిని పరిశీలించే ప్రైమ రీ మెయింటెనెన్స్‌కు 6 గంటలు పడుతుంది. బ్రేకులు, గేర్లు.. తదితరాలను పరిశీలించి సెకండరీ మెయింటెనెన్స్‌కు 4 గంటలవుతుంది. ఈ రెండు రకాల పనులకు పిట్ లైన్లు అవసరమవుతాయి. ఈ లైన్లలో పట్టాల మధ్య మనిషి నిలబడేంత గుంత ఉంటుంది. అందులో నిలబడి మరమ్మతులు చేస్తారు. ఇలాంటి పిట్లైన్లు సికింద్రాబాద్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌పైనే ఉన్నాయి. నాంపల్లి స్టేషన్లో మూడే ఉన్నాయి. రైళ్ల మెయింటెనెన్స్ ఎక్కువ సమయం పడుతుండటం, కొత్త లైన్లు నిర్మించే స్థలం లేకపోవడంతో వేరే రైళ్లను ప్రారంభించే వీలు లేకుండా పోతోంది. కాచిగూడను విస్తరించే పరిస్థితి లేక లింగంపల్లి స్టేషన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ పిట్ లైన్స్ లేక సాధారణమెయింటెనెన్స్ మాత్రమే చేస్తున్నారు. 24 బోగీలుండే పెద్ద రైళ్లకు సరిపడా ప్లాట్‌ఫామ్స్ సికింద్రాబాద్‌లో 7, నాంపల్లిలో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి దగ్గరగా ఉన్న గజ్వేల్‌పై రైల్వే దృష్టి పడింది. స్టేషన్ రెడీ మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త రైల్వే మార్గంలో ఉన్న గజ్వేల్ స్టేషన్ ఇప్పటికే సిద్ధమైంది. రైళ్లు నడుపుకునేందుకు రైల్వే బోర్డు కూడా అనుమతిచ్చింది. ఇక్కడి నుంచి ప్యాసింజర్ రైలును నడపాలని అనుకున్నా కరోనా ఆంక్షల వల్ల మొదలు కాలేదు. గజ్వేల్ నుంచి నగరానికి డెమూ (డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు సేవలను రోజుకు రెండు ట్రిప్పులు నడిపించాలని అనుకున్నా అది కూడా కరోనా వల్ల ఆగిపోయింది. రైల్వే బోర్డు సిగ్నల్ ఇవ్వగానే గజ్వేల్‌కు డెమూ రైలు ప్రారంభమవుతుంది. గజ్వేలే ఎందుకు? హైదరాబాద్‌కు గజ్వేల్ స్టేషన్ చేరువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే దగ్గర్లోని ప్రాంతాల ప్రయాణికులు ఇక్కడికే వచ్చి ఎక్కుతారు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వైపో, కాచిగూడ వైపో వెళ్లే సిటీ ప్రయాణికులూ ఎక్కుతారు. ఆయా స్టేషన్లలో సాధారణ స్టేషన్ తరహాలోరైలు కాసేపు ఆగి బయలుదేరితే సరిపోతుంది. దీంతో రెండు ప్రధాన స్టేషన్లపై మెయింటెనెన్స్ బాధ ఉండదు. ప్రయాణికుల తాకిడి తగ్గి భారం కూడా బాగా తగ్గిపోతుంది. -
ఢిల్లీ మహిళలకు శుభవార్త
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరాకరించింది. -
ఒకటి నుంచి గోరేగావ్ వరకు లోకల్ రైళ్లు
సాక్షి, ముంబై: ఉప నగరంలోని జోగేశ్వరి, గోరేగావ్ ప్రజలకు పశ్చిమ రైల్వే నూతన సంవత్సర కానుక అందజేయనుంది. హార్బర్ మార్గంలో జనవరి ఒకటో తేదీ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ (సీఎస్ఎంటీ) నుంచి నేరుగా గోరేగావ్ వరకు లోకల్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జోగేశ్వరి, గోరేగావ్ వెళ్లే ప్రయాణికులు ఇక అంధేరీలో రైలు మారాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం హార్బర్ రైల్వే మార్గంలో సీఎస్ఎంటీ నుంచి అంధేరి వరకు లోకల్ రైళ్లు నడుస్తున్నాయి. అంధేరి నుంచి గోరేగావ్ వరకు విస్తరించే పనులు ఇటీవల పూర్తికావడంతో ఇక సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర రైల్వే మంత్రి పియుష్ గోయల్ చేతుల మీదుగా జరిగేలా అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై పర్యటన ఖరారైతే స్వయంగా ఆయన చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. ఒకవేళ ఆయన షెడ్యుల్ బిజీ ఉంటే ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభోత్సవం చేసే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం చర్చిగేట్-బోరివలి మధ్య నడుస్తున్న ఏసీ లోకల్ రైలును విరార్ వరకు విస్తరించే కార్యక్రమం కూడా గోయల్ చేతుల మీదుగా జరుగనుంది. బోరివలి స్టేషన్లో ఏసీ లోకల్ రైలుకు పచ్చ జెండ చూపించనున్నారు. ఆ తరువాత చర్చిగేట్-విరార్ ట్రిప్పులు ప్రారంభం కానున్నాయి. -
ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే!
ముంబై: 'ఒకరికి వస్తే కోపం.. అదే కోపం ఒక సమూహానికి వస్తే అది ఉద్యమం' అని ఓ సినిమా డైలాగ్. శుక్రవారం ఉదయం ముంబై శివారులో సరిగ్గా అదే జరిగింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ప్రయాణికులు చేపట్టిన ఆందోళన.. నిమిషాల్లోనే ఉధృతంగా మారింది. కొన్ని గంటలపాటు ముంబై ప్రధాన రవాణా వ్యవస్థ కుప్పకూలినట్లైంది. ముంబై శివారు థానేలోని బదలాపూర్ స్టేషన్ కు ఉదయం 5:30కే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టైం ఏడు గంటలైనా రైలే రాలేదు. అప్పటికే స్టేషన్ జనసమూహంతో కిక్కిరిసిపోయింది. గంటలుగా పేరుకుపోయిన అసహనం ఒక్కసారిగా బద్దలై.. ఆవేశంగా మారింది. అంతా కలిసి స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని నిర్భంధించారు. ఆయనా చేతులెత్తేయడంతో ప్రయాణికుల కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా అన్ని ట్రాక్ లపైకి దూసుకెళ్లి ఎక్కడి రైళ్లను అక్కడే ఆపేశారు. వారు వెళ్లాల్సిన మార్గాన్నే (బదలాపూర్ ట్రాక్ నే) కాకుండా అన్ని ట్రాక్ లకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో కీలకమైన సెంట్రల్ లైన్ (సీఎస్ టీ- కొపొలి) కూడా స్తంభించింది. ఈ కారణంగా ముంబై వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో 'రైళ్లను పునరుద్ధరిస్తున్నాం.. దయచేసి ఆందోళన విరమించండి' అంటూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మొత్తానికి ఉదయం 11 గంటలకు బదలాపూర్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకగానీ రైళ్ల రాకపోకలు కొనసాగలేదు. ముంబైకర్ల జీవితం లోకల్ రైళ్లలో ఎంతలా ముడిపడి ఉంటుందోనన్న సంగతి తెలిసికూడా రైళ్లను ఆలస్యంగా నడిపితే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రయాణికులు కూడా కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదేమో! -
టెర్మినస్‌గా మారనున్న పరేల్ స్టేషన్
సాక్షి, ముంబై : పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. రూ.900 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రణాళికకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైన సంగతి విదితమే. ఈ ప్రణాళికలో భాగంగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి కుర్లా రైల్వే స్టేషన్ల మధ్యలో అదనపు లైన్లను నిర్మించనున్నారు. కుర్ల్లా స్టేషన్లో ఎలివేటెడ్ హార్బర్ లైన్ నిర్మాణానికి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. లైన్లను పెంచడం వల్ల లోకల్ రైలు సేవలు విస్తృతమవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రణాళికకు సంబంధించిన ఫైళ్లను గత వారం రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడకు పంపామన్నారు. సోమవారం ఈ ప్రణాళికకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిందన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను సెంట్రల్ రైల్వే విభాగానికి మరో రెండు మూడు రోజుల్లో పంపించనున్నామన్నారు. అదనపు లైన్ల నిర్మాణానికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రైల్వేకు చెందిన స్థలంలోగానీ లేదా సమీపంలోని భవనాలను తొలగించిగానీ చేపడతామన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి సీఎస్టీ వరకు కుర్లాలో ఉన్న ఐదు. ఆరు లైన్లను పొడిగించనున్నారు. ప్రస్తుతం ఈ లైన్లు కుర్లా నుంచి విద్యావిహార్ వరకే ఉన్నాయి. ఈ లైన్ల పొడిగింపువల్ల మరిన్ని సబర్బన్ రైళ్లను నడిపే వీలు ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. దూర ప్రాంతాల రైళ్లు సీఎస్టీ నుంచి కుర్లా వరకు ఉన్న ఫాస్ట్ లైన్లను ఉపయోగించడంతో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాలలో లోకల్ ప్రయాణికులకు అడ్డంకిగా మారుతోంది. ఈ లైన్ల పొడిగింపువల్ల లోకల్ రైలు ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తుంది. పరేల్ స్టేషన్ పశ్చిమ దిశలో 408 మీటర్ల నిడివిగల ప్లాట్‌ఫాంను కొత్తగా నిర్మించనున్నారు. కాగా ఈ స్టేషన్ పరిసరాల్లో అత్యధిక శాతంమంది తెలుగు ప్రజలే నివసిస్తుంటారు. పరేల్ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయని తెలియడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. లోకల్ రైలు సేవల పొడిగింపు లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కుర్లా వరకు నడిచే లోకల్ రైళ్లను శివారు ప్రాంతాలవరకుపొడిగించనున్నారు. ఇందుకు సంబంధించి ముంబై డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే (సీఆర్) ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బద్లాపూర్, అంబర్నాథ్, కల్యాణ్, కర్జత్, ఆసన్‌గావ్ వరకు సేవలను పొడిగించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కల్యాణ్, కర్జత్, కపోలి వరకు అదనంగా మరో ఐదు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను అమలు చేయనున్నట్లు అధికారి తెలిపారు. కాగా రద్దీ సమయంలో ప్రస్తుతం సీఎస్టీ నుంచి కుర్లా వరకు 51 రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ఖాళీగా నడుస్తున్నాయని, వీటి పొడిగింపువల్ల ఇతర ప్రయాణికులకు కూడా సౌకర్యం కల్పించినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా హార్బర్, ట్రాన్స్‌హార్బర్ మార్గాల్లో కూడా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సెంట్రల్ రైల్వే విభాగం పరిశీలించిందని, అయితే సరిపడినన్ని లైన్లు లేకపోవడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుందని తెలిపారు. వంగాని, అంబర్నాథ్లలో లైన్లు అందుబాటులోకి రైలు సేవలను పొడిగించడంతోపాటు కొత్త రైళ్లను ప్రారంభించనున్నారు. లోకల్ రైళ్ల హాల్ట్ సమయాన్ని తగ్గించి సబర్బన్ రైళ్ల వేగాన్ని పెంచేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకతాయిలపై చర్యలు లోకల్ రైలు బోగీలపెకైక్కే ఆకతాయిలపై రైల్వే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తున్నారు. కాగా గోవండీలోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ నయీం కొద్దిరోజుల క్రితం హార్బర్ మార్గంలో బోగీపెకైక్కి ప్రయాణిస్తుంగా వడాలా రోడ్-అంధేరీ మధ్య ఓవర్ హెడ్ వైరు తగిలి విద్యుఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నయీంను రైల్వే పోలీసులు లోకమాన్య తిలక్ (సైన్) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నయీం ఆదివారం చనిపోయాడు. నయీంపై అప్పటికే రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఎవరు పట్టుబడినా ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బోగీలపెకైక్కి ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. హార్బర్ మార్గంలో ఈ బెడద అధికంగా ఉంది. అనేకమంది ఆకతాయిలకు బోగీపెకైక్కి కూర్చోవడం, ప్రాణంతక స్టంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది. రైల్వే పోలీసులు అనేక పర్యాయాలు వారించినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఓవర్ హెడ్ వైరు నుంచి 25 వేల వోల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుందని హెచ్చరించే బ్యానర్లు, పోస్టరు అన్ని స్టేషన్లలో అంటించారు. అయినప్పటికీ ఇటువంటివారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో బోగీ పెకైక్కేందుకు ఏర్పాటుచేసిన మెట్లను ఇటీవల తొలగించారు. దీంతో ఆకతాయిలంతా కిటికీల మీదుగా పెకైక్కుతున్నారు. ఫలితంగా వైరుకు తగిలి చనిపోతున్నారు. గతంలో ఇటువంటి కేసుల్లో పట్టుబడిన వారికి రూ.500 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేవారు. అయినప్పటికీ ఆకతాయిల్లో మార్పు కనిపించలేదు. దీంతో ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులు నమోదు చేయడం మొదలైంది. -
పలు మార్గాల్లో నేడు మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు. తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్ల సేవలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెంట్రల్, హార్బర్ రైల్వే ప్రజాసంబంధాల అధికారులు వెల్లడించారు. సెంట్రల్మార్గంలో... ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. ఈ కారణంగా ఈ మార్గంలో ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లి స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో నిలుపుతారు. అప్ స్లో లైన్లో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్మార్గంలో... హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌హార్బర్ లైన్లో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీ మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు.