సాక్షి, ముంబై : పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. రూ.900 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రణాళికకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైన సంగతి విదితమే. ఈ ప్రణాళికలో భాగంగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి కుర్లా రైల్వే స్టేషన్ల మధ్యలో అదనపు లైన్లను నిర్మించనున్నారు. కుర్ల్లా స్టేషన్‌లో ఎలివేటెడ్ హార్బర్ లైన్ నిర్మాణానికి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. లైన్లను పెంచడం వల్ల లోకల్ రైలు సేవలు విస్తృతమవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఈ ప్రణాళికకు సంబంధించిన ఫైళ్లను గత వారం రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడకు పంపామన్నారు. సోమవారం ఈ ప్రణాళికకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిందన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను సెంట్రల్ రైల్వే విభాగానికి మరో రెండు మూడు రోజుల్లో పంపించనున్నామన్నారు. అదనపు లైన్ల నిర్మాణానికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రైల్వేకు చెందిన స్థలంలోగానీ లేదా సమీపంలోని భవనాలను తొలగించిగానీ చేపడతామన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి సీఎస్టీ వరకు కుర్లాలో ఉన్న ఐదు. ఆరు లైన్లను పొడిగించనున్నారు.
ప్రస్తుతం ఈ లైన్లు కుర్లా నుంచి విద్యావిహార్ వరకే ఉన్నాయి. ఈ లైన్ల పొడిగింపువల్ల మరిన్ని సబర్బన్ రైళ్లను నడిపే వీలు ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. దూర ప్రాంతాల రైళ్లు సీఎస్టీ నుంచి కుర్లా వరకు ఉన్న ఫాస్ట్ లైన్లను ఉపయోగించడంతో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాలలో లోకల్ ప్రయాణికులకు అడ్డంకిగా మారుతోంది. ఈ లైన్ల పొడిగింపువల్ల లోకల్ రైలు ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తుంది. పరేల్ స్టేషన్ పశ్చిమ దిశలో 408 మీటర్ల నిడివిగల ప్లాట్‌ఫాంను కొత్తగా నిర్మించనున్నారు. కాగా ఈ స్టేషన్ పరిసరాల్లో అత్యధిక శాతంమంది తెలుగు ప్రజలే నివసిస్తుంటారు. పరేల్ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయని తెలియడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.
లోకల్ రైలు సేవల పొడిగింపు
లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) నుంచి కుర్లా వరకు నడిచే లోకల్ రైళ్లను శివారు ప్రాంతాలవరకుపొడిగించనున్నారు. ఇందుకు సంబంధించి ముంబై డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే (సీఆర్) ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బద్లాపూర్, అంబర్‌నాథ్, కల్యాణ్, కర్జత్, ఆసన్గావ్ వరకు సేవలను పొడిగించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కల్యాణ్, కర్జత్, కపోలి వరకు అదనంగా మరో ఐదు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను అమలు చేయనున్నట్లు అధికారి తెలిపారు.
కాగా రద్దీ సమయంలో ప్రస్తుతం సీఎస్‌టీ నుంచి కుర్లా వరకు 51 రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ఖాళీగా నడుస్తున్నాయని, వీటి పొడిగింపువల్ల ఇతర ప్రయాణికులకు కూడా సౌకర్యం కల్పించినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా హార్బర్, ట్రాన్స్‌హార్బర్ మార్గాల్లో కూడా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సెంట్రల్ రైల్వే విభాగం పరిశీలించిందని, అయితే సరిపడినన్ని లైన్లు లేకపోవడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుందని తెలిపారు. వంగాని, అంబర్‌నాథ్‌లలో లైన్లు అందుబాటులోకి రైలు సేవలను పొడిగించడంతోపాటు కొత్త రైళ్లను ప్రారంభించనున్నారు. లోకల్ రైళ్ల హాల్ట్ సమయాన్ని తగ్గించి సబర్బన్ రైళ్ల వేగాన్ని పెంచేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆకతాయిలపై చర్యలు
లోకల్ రైలు బోగీలపెకైక్కే ఆకతాయిలపై రైల్వే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తున్నారు. కాగా గోవండీలోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ నయీం కొద్దిరోజుల క్రితం హార్బర్ మార్గంలో బోగీపెకైక్కి ప్రయాణిస్తుంగా వడాలా రోడ్-అంధేరీ మధ్య ఓవర్ హెడ్ వైరు తగిలి విద్యుఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నయీంను రైల్వే పోలీసులు లోకమాన్య తిలక్ (సైన్) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నయీం ఆదివారం చనిపోయాడు. నయీంపై అప్పటికే రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఇక నుంచి ఎవరు పట్టుబడినా ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బోగీలపెకైక్కి ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. హార్బర్ మార్గంలో ఈ బెడద అధికంగా ఉంది. అనేకమంది ఆకతాయిలకు బోగీపెకైక్కి కూర్చోవడం, ప్రాణంతక స్టంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది. రైల్వే పోలీసులు అనేక పర్యాయాలు వారించినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఓవర్ హెడ్ వైరు నుంచి 25 వేల వోల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుందని హెచ్చరించే బ్యానర్లు, పోస్టరు అన్ని స్టేషన్లలో అంటించారు. అయినప్పటికీ ఇటువంటివారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.
ఈ నేపథ్యంలో బోగీ పెకైక్కేందుకు ఏర్పాటుచేసిన మెట్లను ఇటీవల తొలగించారు. దీంతో ఆకతాయిలంతా కిటికీల మీదుగా పెకైక్కుతున్నారు. ఫలితంగా వైరుకు తగిలి చనిపోతున్నారు. గతంలో ఇటువంటి కేసుల్లో పట్టుబడిన వారికి రూ.500 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేవారు. అయినప్పటికీ ఆకతాయిల్లో మార్పు కనిపించలేదు. దీంతో ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులు నమోదు చేయడం మొదలైంది.
టెర్మినస్‌గా మారనున్న పరేల్ స్టేషన్
Published Wed, Sep 10 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement