terminus
-
తప్పిన పెను ప్రమాదం: అరగంటలో రెండుసార్లు
సాక్షి, ముంబై: బాంద్రా టర్మినస్ నుంచి రామ్‌నగర్ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు సార్లు విడిపోవడంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలోని బాంద్రా టర్మినస్ నుంచి గురువారం ఉదయం రామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కొద్ది సేపటికే పశ్చిమ ఉప నగరంలోని జోగేశ్వరీ–రామ్ మందిర్ స్టేషన్ల మధ్య కప్లింగ్ ఊడిపోయి చివరి రెండు బోగీలు విడిపోయాయి. రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది గంటన్నరకుపైగా శ్రమించి వాటిని జోడించి రైలును పంపించారు. దీంతో ఫాస్ట్ మార్గంలో లోకల్ రైళ్లతో పాటు దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన నాయిగావ్–వసై రోడ్ స్టేషన్ల మధ్య మళ్లీ ఆ బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆ బోగీలను మళ్లీ రైలుకు జోడించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ బోగీలను తెప్పించి జోడించడం కుదరదని అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దింపి అదే రైలులో మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి పంపించారు. అందుకు మరో 25 నిమిషాల సమయం పట్టింది. రెండుసార్లు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే నియమాల ప్రకారం దూరం నుంచి వచ్చిన ప్రతీ రైలును యార్డులో నిర్వహణ పనులు పూర్తయిన తర్వాతే మళ్లీ పంపించడానికి సిద్ధం చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలును ప్లాట్ఫారం పైకి తెస్తారు. కానీ ఇలా బయలుదేరిన అర గంటలోపే రెండు సార్లు బోగీలు విడిపోవడం వర్క్ షాపు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఇలా విడిపోవడం రైల్వే సిబ్బంది నిర్వహణ లోపం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చదవండి: ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర -
టెర్మినస్‌గా మారనున్న పరేల్ స్టేషన్
సాక్షి, ముంబై : పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. రూ.900 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రణాళికకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైన సంగతి విదితమే. ఈ ప్రణాళికలో భాగంగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి కుర్లా రైల్వే స్టేషన్ల మధ్యలో అదనపు లైన్లను నిర్మించనున్నారు. కుర్ల్లా స్టేషన్లో ఎలివేటెడ్ హార్బర్ లైన్ నిర్మాణానికి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. లైన్లను పెంచడం వల్ల లోకల్ రైలు సేవలు విస్తృతమవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రణాళికకు సంబంధించిన ఫైళ్లను గత వారం రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడకు పంపామన్నారు. సోమవారం ఈ ప్రణాళికకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిందన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను సెంట్రల్ రైల్వే విభాగానికి మరో రెండు మూడు రోజుల్లో పంపించనున్నామన్నారు. అదనపు లైన్ల నిర్మాణానికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రైల్వేకు చెందిన స్థలంలోగానీ లేదా సమీపంలోని భవనాలను తొలగించిగానీ చేపడతామన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి సీఎస్టీ వరకు కుర్లాలో ఉన్న ఐదు. ఆరు లైన్లను పొడిగించనున్నారు. ప్రస్తుతం ఈ లైన్లు కుర్లా నుంచి విద్యావిహార్ వరకే ఉన్నాయి. ఈ లైన్ల పొడిగింపువల్ల మరిన్ని సబర్బన్ రైళ్లను నడిపే వీలు ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. దూర ప్రాంతాల రైళ్లు సీఎస్టీ నుంచి కుర్లా వరకు ఉన్న ఫాస్ట్ లైన్లను ఉపయోగించడంతో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాలలో లోకల్ ప్రయాణికులకు అడ్డంకిగా మారుతోంది. ఈ లైన్ల పొడిగింపువల్ల లోకల్ రైలు ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తుంది. పరేల్ స్టేషన్ పశ్చిమ దిశలో 408 మీటర్ల నిడివిగల ప్లాట్‌ఫాంను కొత్తగా నిర్మించనున్నారు. కాగా ఈ స్టేషన్ పరిసరాల్లో అత్యధిక శాతంమంది తెలుగు ప్రజలే నివసిస్తుంటారు. పరేల్ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయని తెలియడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. లోకల్ రైలు సేవల పొడిగింపు లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కుర్లా వరకు నడిచే లోకల్ రైళ్లను శివారు ప్రాంతాలవరకుపొడిగించనున్నారు. ఇందుకు సంబంధించి ముంబై డివిజన్ ఆఫ్ సెంట్రల్ రైల్వే (సీఆర్) ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బద్లాపూర్, అంబర్నాథ్, కల్యాణ్, కర్జత్, ఆసన్‌గావ్ వరకు సేవలను పొడిగించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కల్యాణ్, కర్జత్, కపోలి వరకు అదనంగా మరో ఐదు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను అమలు చేయనున్నట్లు అధికారి తెలిపారు. కాగా రద్దీ సమయంలో ప్రస్తుతం సీఎస్టీ నుంచి కుర్లా వరకు 51 రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ఖాళీగా నడుస్తున్నాయని, వీటి పొడిగింపువల్ల ఇతర ప్రయాణికులకు కూడా సౌకర్యం కల్పించినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా హార్బర్, ట్రాన్స్‌హార్బర్ మార్గాల్లో కూడా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సెంట్రల్ రైల్వే విభాగం పరిశీలించిందని, అయితే సరిపడినన్ని లైన్లు లేకపోవడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుందని తెలిపారు. వంగాని, అంబర్నాథ్లలో లైన్లు అందుబాటులోకి రైలు సేవలను పొడిగించడంతోపాటు కొత్త రైళ్లను ప్రారంభించనున్నారు. లోకల్ రైళ్ల హాల్ట్ సమయాన్ని తగ్గించి సబర్బన్ రైళ్ల వేగాన్ని పెంచేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకతాయిలపై చర్యలు లోకల్ రైలు బోగీలపెకైక్కే ఆకతాయిలపై రైల్వే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తున్నారు. కాగా గోవండీలోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ నయీం కొద్దిరోజుల క్రితం హార్బర్ మార్గంలో బోగీపెకైక్కి ప్రయాణిస్తుంగా వడాలా రోడ్-అంధేరీ మధ్య ఓవర్ హెడ్ వైరు తగిలి విద్యుఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నయీంను రైల్వే పోలీసులు లోకమాన్య తిలక్ (సైన్) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నయీం ఆదివారం చనిపోయాడు. నయీంపై అప్పటికే రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఎవరు పట్టుబడినా ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బోగీలపెకైక్కి ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. హార్బర్ మార్గంలో ఈ బెడద అధికంగా ఉంది. అనేకమంది ఆకతాయిలకు బోగీపెకైక్కి కూర్చోవడం, ప్రాణంతక స్టంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది. రైల్వే పోలీసులు అనేక పర్యాయాలు వారించినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఓవర్ హెడ్ వైరు నుంచి 25 వేల వోల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుందని హెచ్చరించే బ్యానర్లు, పోస్టరు అన్ని స్టేషన్లలో అంటించారు. అయినప్పటికీ ఇటువంటివారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో బోగీ పెకైక్కేందుకు ఏర్పాటుచేసిన మెట్లను ఇటీవల తొలగించారు. దీంతో ఆకతాయిలంతా కిటికీల మీదుగా పెకైక్కుతున్నారు. ఫలితంగా వైరుకు తగిలి చనిపోతున్నారు. గతంలో ఇటువంటి కేసుల్లో పట్టుబడిన వారికి రూ.500 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేవారు. అయినప్పటికీ ఆకతాయిల్లో మార్పు కనిపించలేదు. దీంతో ఇటువంటివారిపై ఆత్మహత్యా యత్నం కేసులు నమోదు చేయడం మొదలైంది. -
ఖార్ రైల్వే స్టేషన్ @ 90
ముంబై: నగర ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఖార్ రైల్వేస్టేషన్ ఏర్పాటుచేసి ఇప్పటికి 90 ఏళ్లు నిండాయి. బాంద్రా పట్టణానికి అనుబంధంగా ఏర్పడిన ఈ స్టేషన్‌ను 1924 జూలై ఒకటో తేదీన ప్రారంభించారు. నగరాభివృద్ధికి అనుగుణంగా అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వస్తున్న ఈ స్టేషన్‌ను ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 85 వేలమంది ఆశ్రయిస్తున్నారు. ఉత్తర బాంద్రాలో ముంబై అభివృద్ధి శాఖ చేపట్టిన పలు పథకాల అమలుకు అవసరమైన సేవలందించేందుకు ఈ స్టేషన్‌ను మొదట ఏర్పాటుచేశారని పశ్చిమ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఖార్‌లో నగరావసరాలకు గాను గృహ నిర్మాణ పథకం కింద పదివేల జనాభాకు సరిపడా 842 ఫ్లాట్లను నిర్మించారు. అంతేకాక ప్రఖ్యాత పాలి హిల్ ప్రాంత వాసులకు కూడా ఈ ఖార్ స్టేషన్ అనుకూలంగా మారింది. మొదట్లో ఈ స్టేషన్‌ను రోజూ సుమారు 1,700 మంది వినియోగించుకుంటారని పశ్చిమ రైల్వేఅధికారులు అంచనా వేశారు.అయితే తర్వాత కాలంలో నగరీకరణ నేపథ్యంలో ఈ స్టేషన్ మంచి సెంటర్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 85 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ 648 పశ్చిమ రైల్వే రైళ్లు, 108 హార్బర్ లైన్ రైళ్లు నిలుస్తున్నాయి. ఈ స్టేషన్‌కు ఉత్తరాన శాంతాకృజ్, దక్షిణాన బాంద్రా ఉన్నాయి. 1960 నాటికే ఈ స్టేషన్ సమీపంలో పలు కార్పొరేట్సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రముఖ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఖార్ ప్రాంతం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలకు నివాసప్రాంతంగా మారింది. -
టెర్మినస్‌గా పరేల్!
సాక్షి, ముంబై: పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సెంట్రల్ రైల్వే పరిపాలనా విభాగం రైల్వే బోర్డుకు పంపించింది. ఈ ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రస్తుతం దాదర్ స్టేషన్‌పై పడుతున్న ప్రయాణికుల భారం 50 శాతానికి తగ్గుతుంది. పరేల్-ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్ల మధ్య వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగించి టెర్మినస్‌ను నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. నగరంలో అత్యధికంగా రద్దీగా ఉండే స్టేషన్లలో దాదర్ ఒకటి. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో స్లో లేదా ఫాస్ట్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు రైలు మారాలంటే దాదర్ స్టేషన్లో తప్పనిసరిగా దిగాల్సిందే. అంతేకాకుండా దూరప్రాంతాలకు వెళ్లే, వచ్చే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో 95 శాతం ఇక్కడ ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్‌పై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడేందుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. దీన్ని బట్టి ఇక్కడ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా మార్చాలనే ప్రతిపాదన కొద్ది సంవత్సరాల క్రితమే తెరపైకొచ్చింది. ప్రతి రోజూ 30 లోకల్ రైళ్లు దాదర్ నుంచి బయల్దేరతాయి. నానాటికీ రద్దీ పెరుగుతుండడంతో ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్ నుంచి అదనంగా రైళ్లు నడపడం సాధ్యం కావడం లేదు. దీంతో పరేల్‌ను టెర్మినస్‌గా మారిస్తే అక్కడి నుంచి కొన్ని లోకల్ రైళ్లను నడిపేందుకు వీలవుతుంది. భవిష్యత్తులో పరేల్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది. దీంతో ఈ స్టేషన్ రాబోయే కాలంలో ఎంతో కీలకపాత్ర పోషించనుంది. పరేల్ టెర్మినస్ ప్రత్యేకతలివే {పస్తుతం ఉన్న అప్ స్లో మార్గం ప్లాట్‌ఫాం పొడవు సీఎస్టీ దిశగా పెంచి ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్‌తో కొత్త వంతెనను కలుపుతారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంకు అనుకుని వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగిస్తారు. అక్కడ మరో ప్లాట్‌ఫాం నిర్మించి అక్కడి నుంచి లోకల్ రైళ్లను నడుపుతారు. ఒకటి, రెండో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) కి ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేస్తారు. (ప్రస్తుతం ఒకేవైపు ఉన్నాయి.) ప్లాట్‌ఫాం మధ్యలో మరో ఎఫ్ఓబీని నిర్మించి తూర్పు దిశగా దిగేందుకు దానికి మెట్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ఒకే బ్రిడ్జిపై ప్రయాణికుల భారం పడదు.