సాక్షి, ముంబై: పరేల్ రైల్వేస్టేషన్ త్వరలో టెర్మినస్‌గా మారనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సెంట్రల్ రైల్వే పరిపాలనా విభాగం రైల్వే బోర్డుకు పంపించింది. ఈ ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రస్తుతం దాదర్ స్టేషన్‌పై పడుతున్న ప్రయాణికుల భారం 50 శాతానికి తగ్గుతుంది. పరేల్-ఎల్ఫిన్‌స్టన్ రోడ్ స్టేషన్ల మధ్య వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగించి టెర్మినస్‌ను నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. నగరంలో అత్యధికంగా రద్దీగా ఉండే స్టేషన్లలో దాదర్ ఒకటి. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో స్లో లేదా ఫాస్ట్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు రైలు మారాలంటే దాదర్ స్టేషన్‌లో తప్పనిసరిగా దిగాల్సిందే. అంతేకాకుండా దూరప్రాంతాలకు వెళ్లే, వచ్చే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో 95 శాతం ఇక్కడ ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్‌పై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడేందుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. దీన్ని బట్టి ఇక్కడ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా మార్చాలనే ప్రతిపాదన కొద్ది సంవత్సరాల క్రితమే తెరపైకొచ్చింది. ప్రతి రోజూ 30 లోకల్ రైళ్లు దాదర్ నుంచి బయల్దేరతాయి. నానాటికీ రద్దీ పెరుగుతుండడంతో ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్ నుంచి అదనంగా రైళ్లు నడపడం సాధ్యం కావడం లేదు. దీంతో పరేల్‌ను టెర్మినస్‌గా మారిస్తే అక్కడి నుంచి కొన్ని లోకల్ రైళ్లను నడిపేందుకు వీలవుతుంది. భవిష్యత్తులో పరేల్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నడిపే యోచనలో రైల్వే శాఖ ఉంది. దీంతో ఈ స్టేషన్ రాబోయే కాలంలో ఎంతో కీలకపాత్ర పోషించనుంది.
పరేల్ టెర్మినస్ ప్రత్యేకతలివే
{పస్తుతం ఉన్న అప్ స్లో మార్గం ప్లాట్‌ఫాం పొడవు సీఎస్టీ దిశగా పెంచి ఎల్ఫిన్‌స్టన్ రోడ్ స్టేషన్‌తో కొత్త వంతెనను కలుపుతారు.
ఒకటో నంబరు ప్లాట్‌ఫాంకు అనుకుని వృథాగా ఉన్న ట్రాక్‌లను తొలగిస్తారు. అక్కడ మరో ప్లాట్‌ఫాం నిర్మించి అక్కడి నుంచి లోకల్ రైళ్లను నడుపుతారు.
ఒకటి, రెండో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ) కి ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేస్తారు. (ప్రస్తుతం ఒకేవైపు ఉన్నాయి.)
ప్లాట్‌ఫాం మధ్యలో మరో ఎఫ్‌ఓబీని నిర్మించి తూర్పు దిశగా దిగేందుకు దానికి మెట్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ఒకే బ్రిడ్జిపై ప్రయాణికుల భారం పడదు.
టెర్మినస్‌గా పరేల్!
Published Wed, Nov 20 2013 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement