CoronaVirus: Lockdown may Continue till September in India, Says BCG Survey - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ రిపోర్టు: జూన్‌ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

Published Sat, Apr 4 2020 9:07 AM | Last Updated on Sat, Apr 4 2020 4:43 PM

Lockdown May Extend In India September BCG study - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 20 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్రం కొట్టిపారేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరోవైపు కోవిడ్‌ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. (లాక్‌డౌన్‌ మరింత కఠినతరం?)

బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండగా... ప్రాంతాలు, వైరస్‌ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.  కాగా, దేశంలో వైరస్‌ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement