
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా నేతృత్వంలోని కమిషన్ వచ్చే వారంలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి లభ్యత, రవాణా తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాల సన్నద్ధత, ఏర్పాట్లపై ఈసీ విస్తృత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి, ఎన్నికల షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్ 7– మే 12వ తేదీల మధ్యలో జరిగాయి.
ఈసారి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ మేరకు మొదటి విడత ఎన్నిక ఏప్రిల్ 10వ తేదీ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ ద్వారా జూన్ 30వ తేదీ వరకు దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి ఆమోదం లభిస్తుంది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడ్డాక మే మూడో వారంలో లేదా కాస్త ముందుగా ఏర్పడే కొత్త ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది.