
ముంబై: దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల లోనార్ సరస్సు ఏర్పడింది. అయితే ఈ సరస్సులోని నీరు ఉన్నట్లుండి గులాబీ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన స్థానికులనే కాక శాస్త్రవేత్తలను, నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ముంబయికి 500 కిలో మీటర్ల దూరంలో బుల్హంద జిల్లాలో ఉన్న లోనార్ సరస్సును చూసేందుకు పర్యాటకులతోపాటు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువగా వస్తుంటారు. నిపుణులు చెబ్తున్న ప్రకారం రంగు మారడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి బాగా ఎక్కువగా మారింది అంటున్నారు. ఈ క్రమంలో లోనార్ సరస్సు సంరక్షణా కమిటీ సభ్యులు గజానన్ మాట్లాడుతూ ‘జాతీయ స్మారక చిహ్నంగా ఉన్న ఈ సరస్సులో 10.5 పిహెచ్‌తో ఉప్పునీరు ఉంది. నీటి లోపల ఆల్గేలు ఉన్నాయి. ఈ మార్పుకు లవణీయత, ఆల్గేలే కారణమవుతాయి’ అన్నారు.
అంతేకాక గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే లోనార్ సరస్సులో నీటి మట్టం ప్రస్తుతం తక్కువగా ఉందని, అందులో మంచినీరు చేరడానికి వర్షం లేదని గజనన్ అన్నారు. తక్కువ స్థాయి నీరు, వాతావరణ మార్పుల వల్ల లవణీయత, ఆల్గే వల్ల నీరు రంగు మారిందని తెలిపారు. ఇరాన్‌లోని ఒక సరస్సు కూడా ఉప్పునీటి కారణంగా నీరంతా ఎర్రగా మారిపోయాయని తెలిపాడు. సరస్సు నీరు రంగు మారడంతో స్థానికులు గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment