
‘సుప్రీం సూచన’ను పరిశీలిస్తున్నాం
ఉత్తరాఖండ్ బలపరీక్షపై 6న చెబుతాం: కేంద్రం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీం చేసిన ఈ సూచనపై తుది నిర్ణయాన్ని శుక్రవారం నాటికి చెబుతామని తెలిపింది. దీనికి న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆమోదం తెలుపుతూ కేంద్రానికి రెండు రోజులు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదావేసింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది.
సుప్రీం పర్యవేక్షణలో విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పదవీచ్యుత సీఎం రావత్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ సూచనపై తదుపరి విచారణ నాటికి నివేదించకపోతే, ఈ అంశపైనా విచారణ చేపడతామన్నారు. బలపరీక్ష రావత్‌కు విశ్వాస పరీక్ష లాంటిది అని అది అవిశ్వాస పరీక్ష కాదని సిబల్, సింఘ్వీ వాదించారు. దీన్ని ఏజీ రోహత్గీ ఆక్షేపిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో రావత్ సీఎంగావిశ్వాస పరీక్షను ఎదుర్కొనలేరని చెప్పారు. ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని 2005, మార్చి 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ దాని ప్రకారం జార్ఖండ్ నమూనాలో సంయుక్త బలపరీక్ష ఉండొచ్చని చెప్పింది. అప్పుడు జార్ఖండ్‌లో శిబూ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌చేస్తూ బీజేపీ నేత అర్జున్ ముండా కోర్టును ఆశ్రయించగా కోర్టు సంయుక్త బలపరీక్షకు ఆదేశించింది.